అరబ్‌ వ్యక్తిపై మూక దాడి.. టీవీలో లైవ్‌..

13 May, 2021 19:05 IST|Sakshi
దాడి దృశ్యం

జెరూసలేం : గత కొద్దిరోజులుగా ఇజ్రాయెల్‌-పాలస్తీనా దేశాలు పరస్పరం రాకెట్‌ బాంబు దాడులు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గాజా లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం జరిపిన రాకెట్‌ దాడుల్లో ఇప్పటివరకు 83 మంది మరణించారు. వీరిలో 17 మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. దాదాపు 487 మంది గాయపడ్డారు. పాలస్తీనా కూడా ఇజ్రాయెల్‌పై బాంబు దాడులు చేస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఓ అరబ్‌ వ్యక్తిపై మూక దాడి చేయటం, ఆ దాడి దృశ్యాలు ఓ టీవీ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం కావటం చర్చనీయాంశంగా మారింది. బుధవారం రాత్రి ఇజ్రాయెల్‌ ఆర్థిక రాజధాని తెల్‌ అవివ్‌లోని బ్యాట్‌ యమ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో వెళుతున్న అరబ్‌ వ్యక్తిని డజన్‌ కంటే ఎక్కువ మంది ఉన్న ఓ మూక అడ్డగించింది.

అతడ్ని బయటకు లాగి విచక్షణా రహితంగా దాడి చేసింది. ఈ దాడి దృశ్యాలు అక్కడి పబ్లిక్‌ ఛానల్‌ కాన్‌ టీవీలో ప్రసారం అయ్యాయి.  దాడిలో అరబ్‌ వ్యక్తి తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయాడు. ఘటన జరిగిన 15 నిమిషాల తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. నడి వీధిలో స్పృహ లేకుండా పడి ఉన్న అతడ్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్‌ చీఫ్‌ రబ్బీ యిట్జాక్ యోసేఫ్ ఈ దాడిని ఖండించారు. ‘‘ ఉగ్రవాద సంస్థలు అమాయక ప్రజలపై దాడులు చేస్తున్నాయి. అది తల్చుకుంటే గుండె బరువెక్కుతోంది.. బాధేస్తుంది. అలాగని మనం రెచ్చిపోకూడదు.. హింసకు పాల్పడకూడదు’’ అని హితవు పలికారు. ‘రిలీజియస్‌ జియోనిజమ్‌’ పార్టీ అధ్యక్షుడు బెట్జలెల్‌ స్మార్ట్‌రిచ్‌ ఈ ఘటనపై స్పందిస్తూ.. ‘‘ జివిస్‌ సోదరులారా.. ఆపండి! ఎట్టిపరిస్థితుల్లోనూ అహింసకు పాల్పడవద్దు’’ అని అన్నారు.  

మరిన్ని వార్తలు