ఇజ్రాయెల్‌లో కాల్పుల మోత: ఐదుగురు పాలస్తీనియన్లు మృతి

27 Sep, 2021 14:16 IST|Sakshi
కాల్పులు జరిగిన ప్రాంతం

టెల్అవివ్: ఇజ్రాయెల్‌ కాల్పుల ఘటనతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్‌ ఉగ్రవాదులు పశ్చిమ ప్రాంతంలోకి చొచ్చుకువస్తున్నారన్న సమాచారంతో ఇజ్రాయెల్‌ సైన్యం ఆదివారం  కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఐదుగురు పాలస్తీనియన్లు మృతి చెందగా, ఇద్దరు ఇజ్రాయెల్‌ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. గత కొన్ని వారాలుగా ఇజ్రాయెల్‌ పశ్చిమ ప్రాంతంలో ఇజ్రాయెల్‌ సైన్యానికి, పాలస్తీనియన్‌ మిలిటెంట్లకు మధ్య కవ్వింపు చర్యలు నడుస్తున్నాయి.


ముఖ్యంగా ఉత్తర పశ్చిమ ప్రాంతంలో ఇజ్రాయెల్‌  చేపట్టిన నిర్మాణాలు, హమాస్‌ ఉగ్రవాదుల కార్యకలాపాలు పెరగడం వల్ల ఇజ్రాయెల్‌ సైన్యం, హమాస్ మిలిటెంట్ల మధ్య హింస పెరుగుతోంది. హమాస్‌ మిలిటెంట్లతో పొంచి ఉన్న ముప్పును తొలగించడానికి, వారి కార్యకలాపాలను అడ్డుకోవడానికి గత కొన్ని వారాలుగా చర్యలు తీసుకుంటున్నామని ఇజ్రాయెల్‌ సైన్యం పేర్కొంది.

చదవండి: Israel vs Hamas: కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు!

దీనిపై ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి నాఫ్తాలి బెన్నెట్ స్పందిస్తూ.. తాము ఊహించినట్లుగానే హమాస్‌ మిలిటెంట్లు దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తోందని అన్నారు. వాటిని ఇజ్రాయెల్‌ సైన్యం అడ్డుకుంటోందని తెలిపారు. ఈ ఘటనపై పాలస్తీనా దేశ వైద్యశాఖ మంత్రి స్పందిస్తూ.. ఉత్తర పశ్చిమ ప్రాంతంలోని జెనిన్ వద్ద ఇద్దరు పాలస్తీనియన్‌ వ్యక్తులు, జెరూసలేంకు ఉత్తర ప్రాంతంలో మరో ముగ్గురు ‍ వ్యక్తులు మృతి చెందారని తెలిపారు. ఈ ఘటనపై హమాస్‌ స్పందిస్తూ.. మృతి చెందిన వారిలో నలుగురు ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూపు సభ్యులుగా నిర్ధారించింది.

మరిన్ని వార్తలు