ఇటలీ విమానంపై కాల్పులు

27 Aug, 2021 04:24 IST|Sakshi

రోమ్‌: కాబూల్‌ ఎయిర్‌పోర్టు నుంచి అఫ్గాన్‌ పౌరులతో బయలుదేరిన ఇటలీ విమానంపై కాల్పులు జరిగినట్లు ఇటలీ రక్షణ శాఖ తెలిపింది. ఈ ఘటనతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. ఇటలీ సైనిక రవాణా విమానం ఒకటి గురువారం ఉదయం సుమారు 100 మంది అఫ్గాన్‌ పౌరులతో కాబూల్‌ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే దానిపైకి కాల్పులు జరిగినట్లు అందులో ప్రయాణిస్తున్న ఇటాలియన్‌ జర్నలిస్ట్‌ ఒకరు తెలిపారని మీడియా వెల్లడించింది.

పైలట్‌ అప్రమత్తతతో విమానం ప్రమాదం నుంచి బయటపడిందనీ, ఈ పరిణామంతో కొద్దిసేపు ప్రయాణికులంతా భయభ్రాంతులకు లోనైనట్లు ఆ జర్నలిస్ట్‌ తెలిపారని పేర్కొంది. తమ సీ–130 రకం రవాణా విమానంపై కాబూల్‌లో కాల్పులు జరిగాయని అంతకుముందు ఇటలీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ ఘటనపై ఇటలీ ప్రభుత్వం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అఫ్గాన్‌లో పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న వేలాది మంది విదేశీయులతోపాటు, అఫ్గాన్‌ పౌరులను ఖాళీ చేస్తున్న దేశాల్లో ఇటలీ కూడా ఒకటి. 

మరిన్ని వార్తలు