‘మా ఊరికి రండి.. బదులుగా రూ. 24.5 లక్షలు తీసుకోండి’

12 Jul, 2021 20:38 IST|Sakshi

విభిన్న ఆఫర్‌ ప్రకటించిన ఇటలీ ప్రభుత్వం

ఖాళీ అవుతున్న గ్రామాల్లో జనావాసం పెంచేందుకు, ఉపాధి కల్పించేందుకు కృషి

రోమ్‌: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఇటలీలో గత కొద్ది కాలంగా పట్టణాలు, నగరాలు ఖాళీ అవుతున్నాయి. జనాలు వలస బాట పట్టడంతో ఇళ్లు, ఊర్లు, నగరాలు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో జనాలను ఆకర్షించడం కోసం.. వలస వెళ్లిన వారిని తిరగి రప్పించడం.. ఖాళీ అయిన ప్రాంతాలు తిరిగి మునపటిలా జనాలతో కలకలలాడటం కోసం వింత ఆఫర్లను ప్రకటిస్తుంది. దానిలో భాగంగా కేవలం రూపాయికే ఇళ్లను అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే.

తాజాగా మరో క్రేజీ ఆఫర్‌తో ముందుకొచ్చింది ఇటలీ ప్రభుత్వం. దేశంలోని ఓ గ్రామంలో నివాసం ఉంటే ఏకంగా 24.5లక్షల రూపాయలు చెల్లిస్తామని తెలిపింది. కాకపోతే కండీషన్స్‌ అప్లై అంటుంది. మరి ఇంతకు  ఆ ప్రాంతం ఎక్కడ.. కండీషన్స్‌ ఏంటో తెలియాలంటే ఇది చదవండి. ఇటలీలోని కలాబ్రియాలో ప్రస్తుతం కేవలం 2 వేల మంది మాత్రమే ఉంటున్నారు. ఏళ్లుగా ఈ గ్రామం ఆర్థికమాంద్యంతో సతమతమవుతోంది. దాంతో చాలా మంది ఉపాధి కోసం వలస బాట పట్టారు. ఈ క్రమంలో కలాబ్రియా స్థానిక ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పనతో పాటు వలసవెళ్లిన వారిని తిరిగి రప్పించేందుకు ఓ వినూత్న ఆలోచన చేసింది. 

ఈ ప్రాంతంలో అతి తక్కువ ధరకే ఇళ్లను విక్రయిస్తుంది. ఇక్కడ ఇల్లు కొన్న వారికి మూడు ఏళ్ల వ్యవధికి గాను అక్కడి ప్రభుత్వమే 24 వేల పౌండ్లు(24,87,660 రూపాయలు) చెల్లిస్తుంది. కాకపోతే కొన్ని షరతులు పెడుతుంది. అవేంటంటే.. 40 ఏళ్ల లోపే వారే ఇక్కడ ఇళ్లు కొనడానికి అర్హులు. అంతేకాక అక్కడ ఉన్న స్థానికులకు ఉపాధి కల్పించి.. వలస వెళ్లిన వారిని తిరిగి రప్పించాలి. అది కూడా వారు చెప్పిన గడువులోపే. 

ఇంటిని కొనుగోలు చేయడానికి ఇక్కడ వ్యాపారం చేయాలనుకునే వారు దరఖాస్తులను 90 రోజుల్లోపు అధికారులకు అందజేయాలి. ఈ ప్రాజెక్ట్‌ను ఇటలీ అధికారులు ‘యాక్టివ్ రెసిడెన్సీ ఆదాయం’ అని పిలుస్తున్నారు. దీనిపై కలాబ్రియా పట్టణ మేయర్ స్పందిస్తూ.. తమ ప్రయోగం సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాదు ఇటాలియన్ ప్రాంతంలో నివసించడానికి ప్రజలను ఆకర్షించండి.. ఇక్కడకు వచ్చే వారికి ఆధునిక సౌకర్యాలను కల్పిస్తాము.. మరింత మెరుగైన విద్య ఆరోగ్య సదుపాయాలను కల్పిస్తాము.. హై-స్పీడ్ ఇంటర్నెట్‌ని అందిస్తామని తెలిపారు.
 

మరిన్ని వార్తలు