డబ్బులిచ్చి మరీ కోవిడ్‌ పేషెంట్లతో డిన్నర్‌లు, పార్టీలు.. ఎందుకంటే

14 Jan, 2022 21:39 IST|Sakshi

రోమ్‌: కరోనా వైరస్‌ గురించి ప్రపంచమంతా భయపడుతోంది. ప్రతి ఒక్కరూ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు కఠిన నిబంధనలు పాటిస్తున్నారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ కూడా తీసుకుంటున్నారు. కాగా కోవిడ్‌ సోకిన వారు ఎవరిని కలవడానికి వీలుండదన్న విషయం తెలిసిందే. వారు తప్పకుండా వారం నుంచి పదిహేను రోజులు ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. డాక్టర్ల సూచనతో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కోవిడ్‌ నుంచి కోలుకోవచ్చు. అయితే ఓ చోట మాత్రం కరోనా వచ్చిన వారితో ఎంచక్కా పార్టీలు చేసుకుంటున్నారు. వాళ్లతో కలిసి ఏకంగా డిన్నర్‌ చేస్తున్నారు. కలిసి వైన్‌ తాగుతున్నారు. ఇందుకు డబ్బులు కూడా చెల్లిస్తున్నారు. ఇదంతా ఇటలీలో జరుగుతోంది. ఎందుకు ఇలా చేస్తున్నారో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..

ఇటలీలో కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. రోజూ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి 50 ఏళ్లు నిండిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్‌ వేసుకోని వాళ్లు, భారీ జరిమానా లేదా వాళ్ల ఉద్యోగం వదిలేసుకోవాల్సి ఉంటుందని ఆదేశించింది. అయితే వ్యాక్సిన్‌ వేసుకోవడం ఇష్టం లేని వాళ్లకు భయం పట్టుకుంది. దీంతో వ్యాక్సినేషన్‌ను తప్పించుకునేందుకు ఉన్న ఏకైక అవకాశం కోవిడ్‌ బారిన పడటం. కోవిడ్‌ సోకి కోలుకున్నవారు యాండీబాడీస్‌ వృద్ధి చెందే వరకు వ్యాక్సిన్‌ వేసుకోకుండా ఉండాలి.

దీంతో కోవిడ్‌ వచ్చిన పేషెంట్లకు డబ్బులు ఇచ్చి మరీ వాళ్లతో డిన్నర్‌ చేస్తున్నారు. వాళ్లతో కూర్చొని వైన్‌ తాగుతున్నారు. దీని ద్వారా తమకు కూడా వైరస్‌ సోకితే వ్యాక్సినేషన్‌ నుంచి తప్పించుకోవచ్చని ప్లాన్‌ చేస్తున్నారు. అయితే వ్యాక్సిన్‌ను తప్పించుకోవడం కోసం కోవిడ్‌ పార్టీల పేరుతో మహమ్మారిని తెప్పించుకుంటే వాళ్లపై కేసులు నమోదు చేస్తామని ఇటలీ ప్రభుత్వం హెచ్చరించింది.

మరిన్ని వార్తలు