రేప్‌ వీడియో పోస్ట్‌ చేసిన ఇటలీ ప్రధాని అభ్యర్థి మెలోనీ.. తొలగించిన ట్విటర్‌

24 Aug, 2022 08:27 IST|Sakshi

రోమ్‌: దారుణంగా అత్యాచారానికి గురైన ఉక్రెయిన్‌ మహిళ వీడియోను పోస్ట్‌ చేసింది ఇటలీ ప్రధాని రేసులో ఉన్న అభ్యర్థి జార్జియా మెలోని(45). దీంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా.. ఉల్లంఘనల పేరిట రెండు రోజుల తర్వాత ఎట్టకేలకు ఆ వీడియోను తొలగించింది ట్విటర్‌. 

ఓ న్యూస్‌ వెబ్‌సైట్‌లో వచ్చిన ఆ వీడియోను యధాతధంగా తన ట్విటర్‌ అకౌంట్‌లో ఆదివారం రాత్రి పోస్ట్‌ చేశారామె. మహిళలపై జరుగుతున్న అరాచకాలకు పరాకాష్టగా పేర్కొంటూ ఆమె ఆ బ్లర్డ్‌ వీడియోను పోస్ట్‌ చేశారు. అయితే.. 

రాజకీయ ప్రత్యర్థులతో పాటు మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు.. మెలోనీ పోస్ట్‌ చేసిన వీడియోను తప్పుబట్టారు. ఇది బాధితురాలి ఉనికిని ప్రపంచానికి తెలియజేయడమే అని, ఆమెను క్షోభపెట్టడమే అవుతుందని వాదించారు. అయితే బాధితురాలికి సానుభూతి తెలిపే క్రమంలోనే తాను ఆ వీడియోను పోస్ట్‌ చేశానని, ఆమెకు న్యాయం జరిగేలా చూడడమే తన ఉద్దేశమని మెలోనీ తన చర్యను సమర్థించుకున్నారు. అయినప్పటికీ.. 

మంగళవారం ఉదయం ట్విటర్‌ ఆ వీడియోను తొలగించింది. ఇక ఈ చర్యపై మెలోనీ నుంచి స్పందన లేదు.  స్థానిక అధికారుల సమాచారం ప్రకారం.. పియాసెంజా నగరంలో 55 ఏళ్ల ఉక్రెయిన్‌ మహిళపై అఘాయిత్యం జరిగింది. గినియాకు చెందిన ఓ శరణార్థి కాలిబాటపైన ఆమెపై దారుణానికి తెగబడ్డాడు. నిందితుడిని గుర్తించిన పోలీసులు.. ఇప్పటికే అరెస్ట్‌ చేసి కేసులో పురోగతి సాధించారు. 

ఇదిలా ఉంటే.. రోమ్‌లో పుట్టి, పెరిగిన జార్జియా మెలోనీకి జర్నలిస్ట్‌గా, మానవ హక్కుల ఉద్యమకారిణిగా మంచి పేరుంది.  సెప్టెంబర్‌ 25వ తేదీన జరగబోయే ఇటలీ జాతీయ సార్వత్రిక ఎన్నికల్లో బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీ తరపున మెలోనీ ప్రధాని అభ్యర్థిగా నిలబడబోతున్నారు. జనాల్లో మద్దతు ఆధారంగా ఆమె ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించవచ్చని పోల్‌సర్వేలు చెప్తు‍న్నాయి. అదే జరిగితే.. ఇటలీకి తొలి మహిళా ప్రధానిగా ఎన్నికై జార్జియా మెలోని చరిత్ర సృష్టిస్తారు.

ఇదీ చదవండి: పుతిన్‌ సన్నిహితుడి కుమార్తె ప్రాణత్యాగానికి ఫలితం!

మరిన్ని వార్తలు