భారత్‌కు ఈయూ చేయూత

4 May, 2021 05:07 IST|Sakshi

నిపుణుల బృందాన్ని, వైద్య పరికరాలు పంపిన ఇటలీ

డెన్మార్క్, స్పెయిన్, నెదర్లాండ్స్‌ నుంచి వెంటిలేటర్లు, ఔషధాలు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఉధృతితో అల్లాడిపోతున్న భారత్‌కు విదేశాలు బాసటగా నిలుస్తున్నాయి. అత్యవసర ప్రాణాధార ఔషధాలను, ఆక్సిజన్‌ ఉత్పత్తి పరికరాలను పంపిస్తున్నాయి. ఇటలీ సోమవారం ఒక నిపుణుల బృందాన్ని, వైద్య పరికరాలను భారత్‌కు పంపింది. ఇక యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) నాలుగో దశ సాయం అందించింది. ఇందులో 60 వెంటిలేటర్లు, ఇతర పరికరాలు ఉన్నారు. ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్‌ను కూడా అందించింది. ఈ ప్లాంట్‌ ద్వారా ఒక ఆసుపత్రికి అవసరమైన ప్రాణ వాయువును ఉత్పత్తి చేయొచ్చు. దీన్ని గ్రేటర్‌ నోయిడాలోని ఐటీబీపీ ఆసుపత్రిలో నెలకొల్పనున్నారు.

ఇటలీ నుంచి వచ్చిన బృందానికి ఇండియాలోని ఆ దేశ రాయబారి విన్సెంజో డి లూకా స్వాగతం పలికారు. ఇక యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) అదనంగా అత్యవసర వైద్య సాయాన్ని భారత్‌కు అందిస్తామని ప్రకటించింది. తన సభ్యదేశాలైన డెన్మార్క్, స్పెయిన్, నెదర్లాండ్స్‌ నుంచి సాయాన్ని భారత్‌కు అందిస్తామంది. కరోనాపై పోరాటంలో భారత్‌ వెంట నిలుస్తామని డి లూకా చెప్పారు. ఈ వైరస్‌ ప్రపంచానికే ఒక సవాలు అని అన్నారు. అందరం కలిసికట్టుగా ఎదిరించాలని పిలుపునిచ్చారు.

భారత్‌కు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. భారత్‌కు అండగా నిలుస్తున్న యూకేకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. డెన్మార్క్‌ నుంచి 53 వెంటిలేటర్లు, స్పెయిన్‌ నుంచి 119 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, 145 వెంటిలేటర్లు పంపుతున్నట్లు ఈయూ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక నెదర్లాండ్స్‌ నుంచి 100 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, 30 వేల డెమ్‌డెసివిర్‌ వయల్స్, 449 వెంటిలేటర్లు పంపిస్తామని పేర్కొంది. జర్మనీ కూడా 15 వేల యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ వయల్స్‌ పంపింది. అలాగే 516 ఆక్సిజన్‌ సిలిండర్లు అందజేసింది. 

మరిన్ని వార్తలు