‘వారు దేశభక్తులు’: ఇవాంకపై విమర్శలు

7 Jan, 2021 14:34 IST|Sakshi

ఆందోళనకారులను దేశభక్తులతో పోల్చిన ఇవాంక

వాషింగ్టన్‌: అగ్రరాజ్య 46వ అధ్యక్షుడిగా డెమొక్రాట్‌ జో బైడెన్‌ గెలుపును ధ్రువీకరించే సమావేశాన్ని అడ్డుకునేందుకు ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ భవనాన్ని ముట్టడించిన విషయం తెలిసిందే. ఆందోళనలను అణచివేసే క్రమంలో జరిపిన కాల్లుల్లో ఇప్పటి వరకు నలుగురు మరణించారు. ఇక ట్రంప్‌ తీరును సొంతపార్టీ నేతలతో పాటు ప్రపంచ దేశాధినేతలు ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ కుమార్తె, వైట్‌హౌజ్‌ సలహాదారు ఇవాంక ట్రంప్‌ తీరు పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్రిక్తతలను తగ్గించాల్సింది పోయి అనాలోచిత వ్యాఖ్యలతో వాటిని మరింత పెంచుతూ.. అగ్నికి ఆజ్యం పోస్తున్నారని మండి పడుతున్నారు. ఇంతకు విషయం ఏంటంటే క్యాపిటల్‌ భవనంపై దాడి చేసిన ట్రంప్‌ మద్దతురాలను ఇవాంక దేశభక్తులతో పోల్చారు. నిరసకారులను దేశభక్తులతో పోల్చడం పట్ల తీవ్ర విమర్శలు రేగడంతో ఆ ట్వీట్‌ని డిలీట్‌ చేశారు. (చదవండి: మమ్మల్ని ఏ శక్తి ఆపలేదు; మేం ఊహించలేదు!)

ఈ ట్వీట్‌లో ఇవాంక ‘అమెరికా దేశభక్తులురా.. భద్రతా ఉల్లంఘన, చట్టాల అమలును అగౌరవపర్చడం ఆమోదయోగ్యం కాదు. హింస ఎన్నిటికి ఆమోదం కాదు. దయచేసి గౌరవంగా ఉండండి’ అని కోరారు. దీనిపై భారీ ఎత్తున విమర్శలు రావడంతో వెంటనే ఈ ట్వీట్‌ని డిలీట్‌ చేశారు. కానీ ఈలోపే నెటిజనులు ఆ ట్వీట్‌ని ఫోటో తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. ఆ తర్వాత కూడా ఇవాంక తన తండ్రి మద్దతుదారులను ఆందోళన విరమించమని కోరకపోగా.. దేశభక్తులంటూ చేసిన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తాను దేశ భక్తులన్నది ఆందోళనకారులని కాదని.. వారు చేసే నిరసనని అంటూ కేట్‌ బెన్నెట్‌ చేసిన ట్వీట్‌కి సమాధానం ఇచ్చారు ఇవాంక. ఈ క్రమంలో ‘శాంతియుత ఆందోళన దేశభక్తికి చిహ్నం. హింస ఎన్నిటికి ఆమోదయోగ్యం కాదు.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అంటూ కేట్‌ బెన్నెట్‌ ట్వీట్‌కి రిప్లై ఇచ్చారు ఇవాంక.(చదవండి: క్యాపిటల్‌ బిల్డింగ్‌ విమానంతో కూల్చేస్తాం!)

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన ట్రంప్‌ శాంతియుతంగా అధికార మార్పడికి సహకరించట్లేదు. పైగా జో బైడెన్‌ గెలుపును అడ్డుకునేందుకు చివరి నిమిషం వరకు తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ధ్రువీకరించేందుకు ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ సంయుక్త సమావేశంలో బైడెన్‌ ఎన్నికను వ్యతిరేకించాలంటూ రిపబ్లికన్‌ నేతల మద్దతు కోరి భంగపడ్డ సంగతి తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు