ఆన్‌లైన్‌ ఉగ్రవాదంపై పోరుకు అమెరికా మద్దతు

15 May, 2021 10:22 IST|Sakshi

ప్యారిస్‌: ఆన్‌లైన్‌ ద్వారా పెరిగిపోతున్న హింసాత్మక అతివాదాన్ని నిరోధించే లక్ష్యంతో మొట్టమొదటి సారిగా అగ్రరాజ్యం అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు దిగ్గజ టెక్‌ సంస్థలు శుక్రవారం వర్చువల్‌గా ఒకే వేదికపైకి చేరాయి. శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో న్యూజిల్యాండ్‌ ప్రధాని ఆర్దెర్న్‌ మాట్లాడుతూ..భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తూ ఆన్‌లైన్‌లో అతివాద భావజాలం విస్తరించకుండా నివారించే విషయంలో మరింత స్పష్టత అవసరమన్నారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సానుకూలంగా స్పందించినందుకు ఆర్దెర్న్‌తోపాటు ఫ్రాన్సు అధ్యక్షుడు మేక్రాన్‌ హర్షం వ్యక్తం చేశారు.

ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఇతరులను ప్రేరేపించేందుకు, అతివాదంలోకి లాగేందుకు ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోకుండా చూడటం ప్రథమ ప్రాథామ్యమని అమెరికా అధ్యక్ష భవనం ప్రతినిధి జెన్‌ సాకి తెలిపారు. తమ దేశాల్లో జరిగిన తీవ్ర దాడుల నేపథ్యంలో మొదటిసారిగా 2019లో న్యూజిల్యాండ్‌ ప్రధానమంత్రి జెసిండా ఆర్దెర్న్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మేక్రాన్‌ దీనిని ప్రారంభించారు. వీరి ప్రయత్నాలకు క్రైస్ట్‌చర్చి పిలుపుగా పేరు వచ్చింది. 2019లో న్యూజిల్యాండ్‌లోని క్రైస్ట్‌చర్చిలోని ఒక మసీదులో ప్రార్థనలు చేస్తున్న వారిపై ఒక తీవ్రవాది జరిపిన కాల్పుల్లో 51 మంది ప్రాణాలు కోల్పోయారు.

అప్పట్లో ఈ ఘటన ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం కావడం తీవ్ర సంచలనం రేపింది. ఇప్పటి వరకు 50కి పైగా దేశాలు, గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్, అమెజాన్‌ వంటి టెక్‌ దిగ్గజాలు కూడా క్రైస్ట్‌చర్చి పిలుపునకు మద్దతు ప్రకటించాయి. తాజాగా అమెరికాతోపాటు నాలుగు దేశాలు వీరికి తోడయ్యాయి. ఆయా దేశాల ప్రభుత్వాలు, టెక్‌ సంస్థలు ఆన్‌లైన్‌లో ఉండే హింసను ప్రేరేపించే అతివాద సంబంధ సమాచారాన్ని గుర్తించే విషయంలో పరస్పరం సహకరించుకుంటున్నాయి.
చదవండి: గాజా నుంచి శివార్లకు తరలిపోతున్న పాలస్తీనియన్లు  

మరిన్ని వార్తలు