ట్రంప్‌ ట్విట్టర్‌ బ్యాన్‌.. స్పందించిన డోర్సే

14 Jan, 2021 11:50 IST|Sakshi

ట్రంప్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ని బ్యాన్‌ చేయడం సరికాదు: ఏంజెలా మెర్కెల్‌

వాషింగ్టన్‌: గత వారం క్యాపిటల్‌ హిల్‌ భవనంపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారుల దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం ట్విట్టర్‌ ట్రంప్‌ అకౌంట్‌ని శాశ్వతంగా బ్యాన్‌ చేసింది. మరోసారి ఇలాంటి విధ్వంసకర చర్యలు జరగకూడదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా చర్యగా ట్రంప్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ని బ్యాన్‌ చేసినట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ట్విట్టర్‌ సీఈఓ జాక్‌‌ డోర్సే ట్రంప్‌ అకౌంట్‌ బ్యాన్‌పై స్పందించారు. ఈ నిర్ణయం  సరైనదే కానీ ఇందుకు తానేం గర్వపడటం లేదని.. పైగా ఇలాంటి చర్యలతో మాట్లాడే స్వేచ్ఛను హరించినట్లే అని అభిప్రాయపడ్డారు. ‘స్పష్టమైన మినహాయింపులు ఉన్నప్పటికీ.. చివరకు నిషేధం విధించాల్సి వచ్చింది అంటే మేం ఆరోగ్యకరమైన సంభాషణను ప్రోత్సహించడంలో విఫలమయ్యామని నేను భావిస్తున్నాను అన్నారు’ డోర్సే. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్స్‌ చేశారు. (చదవండి: ట్రంప్‌ బ్యాన్‌ : ట్విటర్‌ నష్టం ఎంతో తెలుసా? )

‘ఆన్‌లైన్‌ ప్రసంగం వల్ల ఆఫ్‌లైన్‌లో హానీ కలగడం అనేది వాస్తవం. అందువల్ల బ్యాన్‌ విధించడం కరెక్టే. కానీ అది  ప్రజా సంభాషణని విచ్ఛిన్నం చేస్తుంది. విభజన, స్పష్టత, విముక్తి, అభ్యాసం సామర్థ్యాన్ని పరిమితం చేస్తాయి.. ఇలాంటి ముందస్తు చర్యలు ప్రమాదకరమైనవని నేను భావిస్తున్నాను’ అన్నారు డోర్సే. అంతేకాక ఇలాంటి చర్యల వల్ల ఒపెన్‌ ఇంటర్నెట్‌ ఉద్దేశం, ప్రయోజనాలు దెబ్బతింటాయని డోర్సే ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ట్రంప్‌ సోషల్‌ మీడియా అకౌంట్‌పై నిషేధం విధించడాన్ని పలువురు రిపబ్లికన్లు తప్పు పట్టారు. జర్మనీ చాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ కూడా వీరి జాబితాలో ఉన్నారు. ఈ మేరకు మెర్కెల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పరిమితులను శాసనసభ సభ్యులు నిర్ణయించాలి తప్ప ప్రైవేటు సంస్థలు కాదు’ అన్నారు మెర్కెల్‌.  (చదవండి: అభిశంసనకు గురైన డొనాల్డ్ ట్రంప్)

అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ విజయాన్ని సవాలు చేస్తూ ట్రంప్‌ పదేపదే నిరాధారమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారం రోజుల క్రితం అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ విజయాన్ని ధ్రువీకరించేందుకు కాంగ్రెస్‌ సమావేశం అయ్యింది. ఇదే సమయంలో ట్రంప్‌ మద్దతుదారలు క్యాపిటల్‌ హిల్‌ భవనంపై దాడి చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ట్రంప్‌ అభిశంసనను ఎదుర్కొన్నారు. ఇక అమెరికా చరిత్రలో రెండుసార్లు అభిశంసనకు గురైన మొదటి అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు.

మరిన్ని వార్తలు