కమ్యూనిస్టు పార్టీలోకి ప్రపంచ ప్రఖ్యాత నటుడు

12 Jul, 2021 23:22 IST|Sakshi

బీజింగ్‌: వందేళ్లు పూర్తి చేసుకున్న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా (సీపీసీ)లోకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అగ్ర నటుడు చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తమ దేశ మీడియాతో పంచుకున్నారు. తనకు ‘సీపీసీ’లో చేరాలని ఉందంటూ ఆ దేశ అధికారిక పత్రిక ‘గ్లోబల్‌ టైమ్స్‌’ చర్చలో ఆయన పేర్కొన్నారు. ఇంతకు ఆయనెవరో కాదు హాలీవుడ్‌ నటుడు, దర్శకుడు, మార్షల్‌ ఆర్ట్స్‌ సినిమాలతో ప్రపంచ ప్రజలను ఆకర్షించిన జాకీ చాన్‌ (67 ఏళ్లు). జూలై 1వ తేదీన సీపీసీ వంద వసంతాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. శత వసంతాల వేడుకలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ కీలక ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంపై మంగళవారం (జూలై 6) ఆ దేశ సినీ ప్రముఖులతో చర్చా కార్యక్రమం నిర్వహించారు.
 
ఆ చర్చలో చైనా ఫిలిం అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్న జాకీచాన్‌ పై వ్యాఖ్యలు చేశారు. చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) వందేళ్లల్లో ఏం చెప్పిందో అది చేసి చూపించిందని కొనియాడారు. అది కూడా కొన్ని దశాబ్దాల్లోనే పూర్తి చేసిందని చెప్పారు. ఈ క్రమంలోనే తాను కొన్నేళ్లుగా ఆ పార్టీకి మద్దతుదారుగా ఉన్నట్లు తెలిపారు. జాకీ చాన్‌ నటుడు, దర్శకుడు. మార్షల్‌ ఆర్ట్స్‌ నిపుణుడు కూడా. గతంలో జాకి చాన్‌చైనా పీపుల్స్‌ పొలిటికల్‌ కన్సల్టేటివ్‌ కాన్ఫరెన్స్‌ (సీపీపీసీసీ)లో సభ్యుడిగా పని చేశారు.

మరిన్ని వార్తలు