అత్యంత క్లిష్ట దశలో భారత్‌-చైనా సంబంధాలు: జైశంకర్‌

19 Aug, 2022 09:55 IST|Sakshi

బ్యాంకాక్‌: సరిహద్దుల్లో చైనా చేస్తున్న దుశ్చర్యలను ఖండించారు భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌. ప్రస్తుతం భారత్‌-చైనా సంబంధాలు అత్యంత క్లిష్ట దశలో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రెండు పొరుగు దేశాలు కలిసి పని చేస్తేనే ఆసియా అభివృద్ధి పథంలో వెళ్తుందని సూచించారు. బ్యాంకాక్‌ చులలాంగ్‌కోర్న్‌ యూనివర్సిటిలో ఇండో-పసిఫిక్‌లో భారత్‌ విజన్‌పై మాట్లాడిన తర్వాత ఎదురైన ప్రశ్నలకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు జైశంకర్‌.

‘సరిహద్దులో డ్రాగన్‌ చేసిన పనికి ప్రస్తుతం భారత్‌-చైనా సంబంధాలు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి. భారత్‌, చైనా కలసి నడిచేందుకు ఒక్క శ్రీలంక మాత్రమే కాదు, చాలా కారణాలున్నాయని నేను భావిస్తున్నా. అయితే, అది భారత్‌, చైనా వ్యక్తిగత నిర్ణయం. చైనా వైపు సానుకూల స‍్పందన ఉంటుందని మాకు నమ్మకం ఉంది. శ్రీలంకకు అన్ని విధాలా భారత్‌ సాయం చేసింది. ఈ ఏడాదిలోనే 3.8 బిలియన్ డాలర్ల సాయం అందించింది. ఐఎంఎఫ్‌ వద్ద శ్రీలంకకు అవసరమైన మద్దతును ఇస్తాం.’ అని తెలిపారు విదేశాంగ మంత్రి జైశంకర్‌. 

రోహింగ్యాల సమస్యపై అడిగిన ప్రశ్నకు.. బంగ్లాదేశ్‌తో చర్చిస్తున్నామని సమాధానమిచ్చారు మంత్రి జైశంకర్‌. వారిని తిరిగి స్వదేశానికి పంపించటమే ప్రధాన అంశమని, ఆ విషయంలో బంగ్లాదేశ్‌కు మద్దతు ఇస్తామన్నారు. మరోవైపు.. రష్యా నుంచి చమురు దిగుమతులపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు జైశంకర్‌. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నది ఒక్క భారత్‌ మాత్రమే కాదన్నారు. పలు ఐరోపా దేశాలు సైతం చమురు దిగుమతలు చేసుకుంటున్నాయని గుర్తు చేశారు.

ఇదీ చదవండి: అమెరికాలో సెటిల్‌ కావడానికి ప్లాన్‌ చేసిన గొటబయా రాజపక్స!

మరిన్ని వార్తలు