జేమ్స్‌ వెబ్‌కు సాంకేతిక సమస్య

30 Jan, 2023 04:52 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తిమంతమైన అబ్జర్వేటరీ అయిన జేమ్స్‌ వెబ్‌లో మళ్లీ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో అంతరిక్ష రహస్యాలను ఒక్కొక్కటిగా ఛేదిస్తున్న జేమ్స్‌ వెబ్‌లో ఇలాంటి సమస్య రావడం ఇది రెండోసారి. అందులోని అత్యంత కీలకమైన నియర్‌ ఇన్‌ఫ్రారెడ్‌ ఇమేజర్, స్లిట్‌లెస్‌ స్పెక్ట్రోగ్రాఫ్‌ పరికరాల్లో సమాచార అంతరాయం నెలకొంది. దాంతో సంబంధిత సాఫ్ట్‌వేర్‌ మొరాయించింది.

అయితే హార్డ్‌వేర్‌లో ఎలాంటి సమస్యలూ తెలెత్తిన సూచనలు లేకపోవడం ఊరటనిచ్చే విషయమని నాసా పేర్కొంది. ఇన్‌ఫ్రారెడ్‌ ఇమేజర్‌ మాత్రం ప్రస్తుతానికి పని చేయడం లేదని ధ్రువీకరించింది. సమస్యను కనిపెట్టి సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది. ఏకంగా వెయ్యి కోట్ల డాలర్ల ఖర్చుతో తయారు చేసిన జేమ్స్‌ వెబ్‌ గత ఆగస్టులో కూడా ఇలాగే మొరాయించింది. దాని మిడ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌లోనూ సాంకేతిక సమస్య తలెత్తింది. బహుశా ఊహించిన దానికంటే పరిమాణంలో పెద్దవైన అంతరిక్ష పదార్థాలు కెమెరా లెన్స్‌ను గుద్దుకోవడమే రెండోసార్లూ సమస్యకు కారణమైందని నాసా భావిస్తోంది. 

మరిన్ని వార్తలు