ట్రాఫిక్‌లో 40 గంటలు నరకయాతన..!

19 Dec, 2020 10:43 IST|Sakshi

టోక్యో: వర్షం పడి నాలుగైదు గంటలు ట్రాఫిక్‌లో చిక్కుకుంటేనే చిరాకు, అలసట, విరక్తి ఇలా అన్ని రకాల భావాలు కలుగుతాయి. అలాంటిది ఏకంగా 40 గంటలపాటు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతే.. అది కూడా గడ్డకట్టే మంచులో. ఊహించుకుంటనే ఒళ్లు జలదరిస్తుంది కదా. కానీ పాపం జపాన్‌ వాసులు మాత్రం అలా గడ్డ కట్టే చలిలో కార్లలో కూర్చుని ట్రాఫిక్‌ కష్టాలు అనుభవించారు. తినడానికి తిండి, తాగడానికి నీరు లేవు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో 40 గంటల పాటు ఉగ్గబట్టుకుని కార్లలోనే కూర్చున్నారు. పాపం కొందరు దాహం వేసి తాగడానికి నీరు లేకపోవడంతో పక్కనే ఉన్న మంచు తీసుకుని బాటిళ్లలో వేసుకుని కరిగించి.. ఆ నీటిని తాగారు. దాదాపు 40 గంటల నరకయాతన తర్వాత వారు ఇళ్లకు చేరుకున్నారు. ఈ విపత్కర పరిస్థితులు జపాన్‌లో చోటు చేసుకున్నాయి. టోక్యో, నైగటాలను కలిపే కనెట్సు ఎక్స్‌ప్రెస్‌వేలో రికార్డు స్థాయిలో మంచు కురిసింది. (చదవండి: ఆశ్చర్యం.. చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికాడు!)

దాంతో శుక్రవారం రోడ్డును మూసివేశారు. అయితే అప్పటికే హైవే మీద ఉన్న వాహనాలు మంచులో చిక్కుకుపోయాయి. దాదాపు 1000 మంది డ్రైవర్లు ఇలా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. మొదట ఒక కారు మంచులో కూరుకుపోవడంతో దాని వెనక వచ్చిన వాహనాలు అలా నిలిచిపోయాయి. టోక్యో నుంచి వచ్చే ట్రాఫిక్‌ క్లియర్‌ అయ్యింది. కానీ రాజధానిలోకి వెళ్లే రహదారులు మాత్రం మంచుతో కప్పబడి ఉన్నాయి. చీఫ్ క్యాబినెట్ కార్యదర్శి కట్సునోబు కటో మాట్లాడుతూ ‘ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి వాహనాల్లో ఇబ్బందులు పడుతున్న జనాలను కాపడాటనానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ దళాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్న వారికి ఆహారం, పెట్రోల్‌, బ్లాంకెట్స్‌ అందించాయి. ఇక అగ్నిమాపక దళాలు ఇప్పటికే కొందరి డ్రైవర్లను కాపాడారు. వీరిలో ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు’ అని తెలిపారు. ఇప్పటికే హైవే కార్మికులు అనేక అడుగుల ఎత్తు మేర మంచుతో కప్పబడిని రహదారులను క్లియర్‌ చేస్తున్నారన్నారు. ఇక సముద్ర తీరం వెంబడి ప్రాంతాల్లో భారీ మంచు కురిసే అవకాశం ఉన్నట్లు జపాన్‌ వాతావరణ సంస్థ హెచ్చరించింది. (చదవండి: గులాబీ రంగులోకి మంచు.. కారణం!)

ఇక కొన్ని ప్రాంతాల్లో 32 అంగుళాల మేర మంచు కురిసింది. హిమపాతంలో చిక్కుకుని ఇబ్బంది పడుతున్న ప్రజలకు సహాయం చేయడానికి అధికారులు మిలిటరీని మోహరించారు. ప్రధాని యోషిహిదే సుగా అత్యవసర క్యాబినెట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

మరిన్ని వార్తలు