Russia War: యుద్ధంలో ఊహించని ట్విస్టులు.. ఫుల్‌ జోష్‌లో పుతిన్‌!

19 Apr, 2022 07:29 IST|Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు జరుగుతున్న వేళ భయనక వాతావరణం చోటుచేసుకుంది. ఎటు చూసినా శవాలు గుట్టలుగుట్టలుగా పడిపోయి ఉండటం ప్రపంచ దేశాలను కలచివేస్తోంది. కాగా, మారియుపోల్‌లో పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని, రష్యా ఇలాగే దాడులు కొనసాగిస్తే చర్చలకు అవకాశం ఇకపై ఉండదని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మారియుపోల్‌లో మిగిలిన ఉక్రేనియులను రష్యా సైన్యం చుట్టుముట్టిందన్నారు. దీంతో మారియుపోల్‌ నగరం దాదాపు రష్యా హస్తగతమైనట్లు తెలుస్తోంది. కానీ, తాము తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. 

ఇదిలా ఉండగా.. యుద్దం కారణంగా రష్యాపై ఆంక్షలపర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పుతిన్‌, రష్యాకు చెందిన పలువురు ప్రముఖులపై అనేక దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా.. రష్యాపై కఠిన ఆంక్షలు విధించడానికి జపాన్‌, స్విట్జర్లాండ్‌ అంగీకరించాయి. ఉక్రెయిన్‌ పౌరులపై దాడులకు రష్యాను జవాబుదారీగా చేయాలని స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడు ఇగ్నాజియో కాసిస్‌, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిద సోమవారం టోక్యోలో జరిగిన చర్చల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రష్యా నుంచి బొగ్గు దిగుమతులను దశలవారీగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు కిషిద తెలిపారు. అలాగే, రష్యాకు చెందిన ప్రముఖుల ఆస్తులను ఫ్రీజ్‌ చేస్తున్నట్టు వెల్లడించారు. రష్యా సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగించే వస్తువుల ఎగుమతులను కూడా నిషేధిస్తున్నట్టు పేర్కొన్నారు.

మరోవైపు.. ఉక్రెయిన్‌లో రష్యా తరఫున పోరాడేందుకు సిరియా ఫైటర్లు సిద్ధమవుతున్నారు. సుహైల్‌ ఆల్‌ హసన్‌ డివిజన్‌కు చెందిన ఫైటర్లతో పాటు మాజీ సైనికులు, తిరుగుబాటుదారులు రష్యాకు మద్దతుగా రంగంలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. జనరల్‌ అలెగ్జాండర్‌ను ఉక్రెయిన్‌పై యుద్ధ దళపతిగా పుతిన్‌ నియమించిన సంగతి తెలిసిందే. గతంలో ఈయనకు సిరియాలో పనిచేసిన అనుభవం ఉంది. ఇంతవరకు దాదాపు 40వేలమంది సిరియన్లు రష్యాతో కలిసి పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు మానవహక్కుల కార్యకర్తలు తెలిపారు. 

ఇది చదవండి: ‘కుటుంబీకులు’ లేకుండా... లంక కొత్త కేబినెట్‌

మరిన్ని వార్తలు