జపాన్‌లో లోన్లీనెస్‌ మినిస్టర్‌

1 Mar, 2021 02:03 IST|Sakshi

సామాజిక సంబంధాల బలోపేతానికి ప్రయత్నం 

కోవిడ్‌ కారణంగా మహిళల్లో పెరిగిన ఆత్మహత్యలు 

ఉపాధి కోల్పోవడం, గృహహింస, మానసిక ఒత్తిళ్ళే కారణమంటోన్న నిపుణులు 

టోక్యో: జపాన్‌ ప్రధాన మంత్రి యోషిహిదే సుగా తన మంత్రివర్గంలో తొలిసారి ఓ కొత్త శాఖని ప్రవేశపెట్టారు. దానిపేరు ‘లోన్లీనెస్‌ మినిస్టర్‌’. అంటే ఒంటరితనానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ అని అర్థం. ఇంత ఈ అవసరం ఏమొచ్చిందనేగా మీ అనుమానం. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ మహమ్మారి సృష్టించిన విలయ తాండవం అంతా ఇంతా కాదు. కోవిడ్‌తో మరణాలు ఒక ఎల్తైతే, కోవిడ్‌ కారణంగా ఒంటిరితనంతో మరణిస్తోన్న వారి సంఖ్య జపాన్‌లో 11 ఏళ్ళలో ఎప్పుడూలేనంతగా పెరిగింది. జాతీయ సమస్యలతో పాటు తీవ్రతరమౌతోన్న ఆత్మహత్యల సమస్యను ఎదుర్కొనేందుకు ‘లోన్లీనెస్‌ మినిస్ట్రీ’ని జపాన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 

యూకేలో తొలిప్రయత్నం 
అయితే లోన్లీనెస్‌ మంత్రిత్వ శాఖను ప్రవేశపెట్టిన తొలిదేశం జపాన్‌ మాత్రం కాదు. 2018లో యూకేలో తొలిసారి ఇలాంటి ఒక శాఖను ప్రవేశపెట్టారు. యూకేని ఆదర్శంగా తీసుకొని జపాన్‌ ప్రధాన మంత్రి యోషిహిదే సుగా తన మంత్రివర్గంలో ఈ లోన్లీనెస్‌ శాఖను ప్రవేశపెట్టారు. ఈ కొత్త పోర్ట్‌ఫోలియో దేశంలో క్షీణిస్తోన్న జననాల రేటుని ఎదుర్కోవడం, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలను పునరుజ్జీవింపజేసే అంశాలపై దృష్టి సారిస్తుంది. మంత్రి టెట్సుషి సకామోటో ఏకకాలంలో ఈ రెండు బాధ్యతలను నిర్వర్తిస్తారని జపాన్‌ ప్రధాని సుగా తెలిపారు. 

జాతీయాంశాలు, కోవిడ్‌ మహమ్మారి కాలంలో పెరుగుతోన్న మహిళల ఆత్మహత్యల సమస్యను ఎదుర్కొనేందుకు ప్రధాని యోషిహిడే సుగా తనకు ఈ బాధ్యతలు అప్పగించినట్టు మంత్రి సకామోటో మీడియాకు వివరించారు. సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకొంటూ సమగ్రవ్యూహాన్ని రూపొందించా లని ప్రధాని సూచించారని మంత్రి చెప్పారు. సామాజిక ఒంటరితనాన్ని పరిష్కరించేందుకు ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు కార్యక్రమాన్ని రూపొందించనున్నట్టు మంత్రి చెప్పారు. కోవిడ్‌ మహమ్మారి సమ యంలో పెరిగిన ఆత్మహత్యలు, పిల్లల్లో పేదరికం సమస్యలు పరిష్కరించేందుకు ఫిబ్రవరి 19న క్యాబినెట్‌లోనే ‘ఐసోలేషన్, లోన్లీనెస్‌ కౌంటర్‌ మెజర్స్‌ ఆఫీస్‌’ని ఏర్పాటు చేశారు.  

టోక్యోలో ప్రతి ఐదుగురిలో ఒక మహిళ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు 
అనేక దేశాల్లో మాదిరిగానే జపాన్‌లో సైతం కోవిడ్‌ భారం మహిళలపై ఎక్కువగా పడింది. కోవిడ్‌ మహమ్మారి మహిళల స్థితిగతులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది.జపాన్‌లోని మహానగరం టోక్యోలో ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు ఒంటరిగా జీవిస్తున్నారు. కోవిడ్‌ కారణం గా బయటకు వెళ్ళకుండా ఇళ్ళకే పరిమితం కావ డంతో అసలే ఒంటరిగా ఉంటోన్న మహిళలు మరింత ఒంటరితనాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. మానసికంగా అది వారిని కుంగదీసింది.  

కోవిడ్‌లో 15 శాతం పెరిగిన మహిళల ఆత్మహత్యలు 
జాన్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ గణాంకాలను బట్టి జపాన్‌లో 4,26,000 కోవిడ్‌ కేసులు నమోదుకాగా, 7, 577 మంది మరణించారు. గత ఏడాది జపాన్‌లో ఆత్మహత్యకు పాల్పడిన మహిళల సంఖ్య మొత్తం దేశంలోని కోవిడ్‌ మరణాల సంఖ్యకు దగ్గరగా ఉండడం ఆందోళన కలిగించే విషయం. గత ఏడాది జపాన్‌లో 6,976 మంది మహిళలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ సంఖ్య 2019 కంటే 15 శాతం అధికం. గత పదకొండేళ్ళలో ఆత్మహత్యల సంఖ్య ఇంతలా పెరగడం ఇదే తొలిసారి. గత ఏడాది పురుషులకంటే మహిళలు ఎక్కువ మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు.  

పెరిగిన లైంగిక వేధింపులు, గృహహింస 
ఎంతో మంది మహిళలు వర్క్‌ఫ్రం హోం కారణంగా ఇటు ఇంటి పని, అటు ఆఫీసు పనితో పాటు పిల్లల సంరక్షణా బాధ్యతలతో ఒత్తిడికి గురవుతున్నారు. అంతేకాకుండా కరోనా కాలం లో గృహహింస, లైంగిక వేధింపులు తీవ్రంగా పెరిగిపోయాయి. పెరుగుతోన్న మానసిక, శారీ రక సమస్యలు మహిళల ఆత్మహత్యలకు కారణమౌతున్నాయని నిపుణులు భావిస్తున్నారు.  

వైరస్‌ భారాన్ని మోసింది ఎక్కువగా మహిళలే 
కరోనా వైరస్‌ భారాన్ని మోసింది ఎక్కువగా మహిళలేనని జపనీస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ యుకి నిషిముర అభిప్రాయపడ్డారు. మహిళలు తమ ఆరోగ్యం గురించి మాత్రమే చూసుకుంటే సరిపోదు. వాళ్ళ పిల్లలు, వృద్ధులు, మొత్తం కుటుంబం ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన భారం కూడా వారిపైనే ఉంటుంది. లాక్‌డౌన్‌ సమయంలో ఇంటి పరిశుభ్రతలాంటి సమస్యలు వారిపై భారాన్ని మరింత పెంచాయి అంటారు యుకి నిషిముర.

ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది 
జపాన్‌లో ఉద్యోగాలు చేస్తోన్న మహిళల్లో సగం మందివి పార్ట్‌టైం, లేదా కాంట్రాక్టు ఉద్యోగాలు. కోవిడ్‌ కారణంగా కంపెనీలు మూతపడటంతో ముందుగా మహిళలనే ఉద్యోగాల్లోనుంచి తీసివేశారు. గత ఏడాది తొలి తొమ్మిది నెలల్లో 1.44 మిలియన్ల మంది ఇలాంటి కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. అందులో సగానికి పైగా మంది మహిళలే కావడం గమనార్హం. 2020లో బలవన్మరణాలకు పాల్పడిన మహిళల్లో మూడింట రెండొంతుల మంది నిరుద్యోగులే. ఉద్యోగాలను కోల్పోవడం మహిళలను మరింత మానసిక ఒత్తిడికి గురిచేసింది అని సోషల్‌ ఎపిడెమియాలజీ నిపుణులు, ఒసాకా యూనివర్సిటీ పొలిటికల్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌ టెస్టూయా మాట్సు బయాషి అభిప్రాయపడ్డారు. 

మరిన్ని వార్తలు