జపాన్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన షింజో అబే పార్టీ..

11 Jul, 2022 13:37 IST|Sakshi
(ఫైల్‌ఫైట్‌)

టోక్యో: జపాన్‌ ఎన్నికల్లో మాజీ ప్రధాని షింజో అబే పార్టీ ఘన విజయం సాధించింది. ఆయన మరణించిన రెండు రోజులకే జరిగిన ఈ ఎన్నికల్లో అధికార లిబరల్ డెమొక్రటిక్‌ పార్టీ(ఎల్‌డీపీ)-కొమైటో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఫలితంగా ఎగువసభలో 76 సీట్లు కైవసం చేసుకుని తిరుగులేని మెజారిటీ సాధించింది.

ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ నర నగరంలో షింజో అబే శుక్రవారం హత్యకు గరయ్యారు. ఆ తర్వాత రెండు రోజులకే ఎన్నికలు జరిగాయి. అదే రోజు రాత్రి ప్రస్తుత ప్రధాని ఫుమియో కిషిదా, పార్టీ నేతలు నల్ల టైలు ధరించి మీడియా ముందు సంతాపం తెలిపారు.

షింజో మృతితో బాధలో ఉన్న ఫుమియో కిషిదా.. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను వెల్లడిస్తూ వారి పేర్ల పక్కన గులాబీ పూలు పెట్టారు.  కానీ ఆయన మొహంలో మాత్రం బాధ తప్ప గెలిచిన ఆనందం కూడా లేదు. ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఎన్నికల ప్రక్రియను ఈసారి హింస భయపెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ఎన్నికలు నిర్వహించాలనే అనుకున్నట్లు చెప్పారు.

జపాన్ ఎగువసభ ఎన్నికల్లో ఈసారి 52.05శాతం పోలింగ్ నమోదైంది. 2019తో పోల్చితే ఇది అధికం. ఈసారి 2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును ముందుగానే వినియోగించుకున్నారు. ఈ విజయంతో మరో మూడేళ్ల పాటు ఫుమియో కిషిదా ఎలాంటి ఆటంకం లేకుండా పరిపాలన కొనసాగించవచ్చు.

చదవండి: మత సంస్థపై ద్వేషంతోనే షింజో హత్య

మరిన్ని వార్తలు