Tokyo Olympics: ఒలింపిక్స్‌ రాష్ట్రంలో కరోనా విజృంభణ, హెచ్చరికలు జారీ

31 Jul, 2021 17:45 IST|Sakshi

టోక్యో: విశ్వ క్రీడా సంబురం ఒలింపిక్స్‌ పోటీలు జపాన్‌లో హోరాహరీగా సాగుతున్నాయి. అంతేస్థాయిలో ఆ దేశంలో కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. మహమ్మారి విజృంభణ తీవ్రస్థాయిలో ఉండడంతో జపాన్‌ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌ జరుగుతున్న టోక్యో రాష్ట్రంతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. కరోనా వ్యాప్తి కట్టడి కోసం పటిష్ట చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

దేశ రాజధాని టోక్యోతో పాటు సైతమ, చిబ, కనగవ, ఒసాకా, ఒకినవ రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రధానమంత్రి సుగ ప్రకటించారు. ఆగస్ట్‌ 31వ తేదీ వరకు ఎమర్జెన్సీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. హొక్కయిడో, ఇషికవ, క్యోటో, హ్యోగో, ఫకుఒక, ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) వెల్లడించింది.

అయితే కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో ప్రజలకు పలు సూచనలు చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు సూచించింది. ప్రయాణాలు విరమించుకోవాలని తెలిపింది. కరోనా నిబంధనలు పక్కాగా పాటించాలని హెచ్చరించింది. ఆగస్ట్‌ నెలాఖరు వరకు 40 శాతం ప్రజలకు రెండు డోసులు అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది.

ఆ దేశంలో గతవారంతో పోలిస్తే పది శాతం మేర కేసులు పెరిగాయి. ఏప్రిల్‌, జూన్‌ నెల మధ్యలో నెమ్మదించిన కరోనా జూలై తీవ్రమైంది. ముఖ్యంగా ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం​ దేశ రాజధాని టోక్యో వేదికగా ఒలింపిక్స్‌ క్రీడలు జరుగుతున్నాయి. దీంతో జపాన్‌లో పెరుగుతున్న కరోనాతో ఇతర దేశాలు కూడా భయాందోళన చెందుతున్నాయి. తమ క్రీడాకారుల ఆరోగ్యంపై దృష్టి సారించాయి.
 

మరిన్ని వార్తలు