ఆదాయం పెంచేందుకు... ‘మందు’కు రండి

20 Aug, 2022 05:02 IST|Sakshi

యువతను బతిమాలుతున్న జపాన్‌

దేశంలో బాగా పడిపోయిన లిక్కర్‌ సేల్స్‌

దాంతో రంగంలోకి నేషనల్‌ ట్యాక్స్‌ ఏజెన్సీ

యూత్‌తో తాగించాలంటే ఏం చేయాలి?

సలహాలివ్వాలంటూ దేశవ్యాప్త కాంపిటీషన్‌

టోక్యో: ‘యువతీ యువకుల్లారా! బాబ్బాబూ, దయచేసి మద్యం అలవాటు చేసుకోండి. మీకు నచ్చిన బ్రాండ్‌ ఎంపిక చేసుకుని తాగండి. ప్లీజ్‌’ అంటోంది జపాన్‌ సర్కారు! దేశంలో లిక్కర్‌ ఆదాయం ఏటేటా భారీగా పడిపోతుండటమే ఇందుకు కారణం. 1995లో సగటున ఒక్కో జపనీయుడు ఏటా 100 లీటర్ల మందు తాగితే 2020 కల్లా అది ఏకంగా 75 లీటర్లకు పడిపోయిందట.

దాంతో 1980ల్లో మొత్తం పన్ను ఆదాయంలో 5 శాతంగా ఉన్న మద్యం వాటా కాస్తా 2011కు 3 శాతానికి, 2020కల్లా ఏకంగా 1.7 శాతానికి తగ్గిందని జపనీస్‌ టైమ్స్‌ పేర్కొంది. 2019తో పోలిస్తే 2020లో మద్యం ఆదాయం ఏకంగా 110 బిలియన్‌ యెన్ల మేరకు పడిపోయిందట! గత 31 ఏళ్లలో ఇదే అతి పెద్ద తగ్గుదల! ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్‌ ఇప్పటికే నిధుల లేమితో సతమతమవుతోంది.

మద్యం అమ్మకాలు కుచించుకుపోవడం మూలి గే నక్కపై తాటిపండు చందంగా మారింది. దాంతో ప్రభుత్వం ఆందోళనలో పడింది. వాటిని ఎలాగైనా పెంచాలని కంకణం కట్టుకుంది. ఇంతకీ సమ స్య ఎక్కడుందా అని కుస్తీ పడితే తేలిందేమిటంటే, పెద్దలు పర్లేదు గానీ జపాన్‌ యువతే అస్సలు మందు జోలికే పోవడం లేదట. జీవన శైలిలో వచ్చిన మార్పులు, కరోనా మహమ్మారి వంటి వాటివల్ల యూత్‌ మందు ముట్టడం మానేశారట. ఆరోగ్యం విలువ తెలిసొచ్చింది గనుక కరోనా సమస్య తగ్గుముఖం పట్టినా బాటిళ్లకేసి కన్నెత్తి కూడా చూడటం లేదట! లిక్కర్‌ అమ్మకాలు తగ్గుముఖం పట్టడానికి ఇదే ప్రధాన కారణమని తేలింది.

సేక్‌ వివా...
ఈ నేపథ్యంలో మందు తాగేలా యువతను ప్రోత్సహించేందుకు భారీ ప్రచారానికి జపాన్‌ ప్రభుత్వం తెర తీసింది. ఇందులో భాగంగా ‘‘సేక్‌ వివా’’ పేరుతో నేషనల్‌ ట్యాక్స్‌ ఏజెన్సీ దేశవ్యాప్త పోటీ నిర్వహిస్తోంది. 20 నుంచి 39 ఏళ్ల మధ్య వయస్కులు ఇందులో పాల్గొనవచ్చు. యూత్‌లో మందు కొట్టే అలవాటును పెంచేందుకు ఏం చేయాలో వారు సలహాలు సూచనలివ్వాలి. అందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెటావర్స్‌ తదితరాల సాయంతో వినూత్నం, ఆకర్షణీయం అయిన సేల్స్‌ టెక్నిక్స్‌ పద్ధతులను రూపొందించవచ్చు.

ఈ పోటీ సెప్టెంబర్‌ 9 దాకా నడుస్తుంది. ఫైనలిస్టులను అక్టోబర్లో నిపుణుల కన్సల్టేషన్‌ కోసం ఆహ్వానిస్తారు. నవంబర్లో టోక్యోలో తుది రౌండ్‌ పోటీ ఉంటుంది. విజేత తన మద్యం అమ్మకాల పెంపు బ్లూప్రింట్‌ను అమలు చేసేందుకు ఏజెన్సీ పూర్తి సహాయ సహకారాలు అందజేస్తుందట! ‘‘మద్యం మార్కెట్‌ నానాటికీ కుంచించుకుపోతోంది. అందుకే యువత మందు అలవాటు చేసుకుని ఈ పరిశ్రమకు జీవం పోసేలా చేయడమే ఈ కాంపిటీషన్‌ లక్ష్యం’’ అని ఏజెన్సీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఇదేం దిక్కుమాలిన పోటీ!
ఈ కాంపిటీషన్‌పై పలు వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వమే పనిగట్టుకుని మద్యం అమ్మకాలు పెంచేందుకు ప్రయత్నించడం ఏమిటంటూ ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ‘‘అది కూడా దేశ సంపద అయిన యువతను మందు తాగి ఆరోగ్యం చెడగొట్టుకొమ్మని ప్రభుత్వమే పిలుపునివ్వడం ఎంతవరకు సబబు? మద్యానికి దూరంగా ఉండటం నిజానికి మంచిదే కదా!’’ అని జనం ప్రశ్నిస్తున్నారు. ఆదాయమే తప్ప జనారోగ్యం పట్టదా అంటూ దుయ్యబడుతున్నారు. ‘మితిమీరిన తాగుడు మంచిది కాదు. అదో పెద్ద సామాజిక సమస్య’ అంటూ జపాన్‌ ఆరోగ్య శాఖ గతేడాది కార్యక్రమాలు జరిపిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు