ఇక అక్కడ పనిదినాలు నాలుగు రోజులే!

25 Jun, 2021 07:44 IST|Sakshi

కరోనా వైరస్‌ ఎన్నో మార్పులు తీసుకొస్తోంది. రిమోట్‌ నుంచి హైబ్రిడ్‌ వర్కింగ్‌ విధానానికి దారితీసింది. ఇందులో భాగంగా జపాన్‌ మరో అడుగు ముందుకు వేయబోతోంది. పని దినాలను ఐదు నుంచి నాలుగు రోజులకు తగ్గించాలని అనుకుంటోంది. ఈ మేరకు ఒక ప్రతిపాదనను వార్షిక​ ఆర్థిక విధానాల మార్గదర్శకాలలో కీలకంగా చేర్చింది. 

టోక్యో: జపాన్‌ గవర్నమెంట్‌ 2021 కొత్త ఆర్థిక విధానాలతో వార్షిక మార్గదర్శకాల్ని విడుదల చేసింది. అందులో ఐదురోజుల పనిదినాలకు బదులు.. నాలుగు రోజులే పనిరోజులు ఉండాలని ప్రతిపాదించింది. ఉద్యోగుల పని-జీవితం ఈ రెండు విషయాల్ని పరిగణనలోకి తీసుకుని.. వాటిని సమతుల్యం చేసే విధంగా ఈ విధానాల్ని రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొంది. జపాన్‌ అంటే హార్డ్‌వర్కింగ్‌కు కేరాఫ్‌ అనే ముద్ర ప్రపంచం మొత్తం ఉంది. అలాంటి దేశంలో తమ పని గంటల్ని తగ్గించాలని ఉద్యోగులు చాలా ఏళ్లుగా కోరుకుంటున్నారు.. ఉద్యమిస్తున్నారు. ఈ తరుణంలో నాలుగు రోజుల పనిరోజులు ఊరట కలిగించేదే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఇక ఈ వ్యవహారంలో రాజకీయ నేతలు సైతం జోక్యం చేసుకుంటున్నారు. కొందరు నేతలు కార్పొరేట్‌ ప్రతినిధులతో ఎంప్లాయిస్‌ పనిగంటల తగ్గింపు, వర్క్‌ఫ్రమ్‌ హోం లాంటి అంశాల గురించి చర్చిస్తున్నారు. ఇక తాజా మార్గదర్శకాలపై వాళ్లంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెలలోపే నాలుగు రోజుల పనిదినం పాలసీ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే మేధావులు మాత్రం రెండు వర్గాలుగా విడిపోయి చర్చించుకుంటున్నారు. నాలుగు రోజుల పనిదినాల వల్ల అవుట్‌పుట్‌ తగ్గిపోతుందని, ప్రొడక్టివిటీ​పెరగకపోయినా.. ఉత్తేజంగా పని చేస్తారని, అదే టైంలో జీతాల కోతల గురించి కూడా ఉద్యోగులు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

కరోషి మరణాలు
వర్క్‌ప్లేస్‌ మరణాలకు జపాన్‌ ఉద్యోగులు పెట్టుకున్న పేరు. తీవ్ర పని ఒత్తిడితో గుండెపోటు తదితర అనారోగ్య సమస్యలతో చనిపోయినా, లేదంటే ఒత్తిడితో ఆత్మహత్యలుచేసుకున్నా వాటిని కరోషి మరణాలుగా పరిగణిస్తారు. 2015, క్రిస్మస్‌నాడు మట్సూరి టకహషి(24) అనే యువతి.. పని ఒత్తిడి తట్టులేక ఆత్మహత్య చేసుకోవడంతో జపాన్‌ పని వాతావరణం, పని గంటల గురించి వీర లెవల్‌లో చర్చ జరిగింది.

చదవండి: బఫెట్‌ రాజీనామా! ఎం జరిగిందంటే..

>
మరిన్ని వార్తలు