ఆఫీసులో నిద్రకు న్యాప్‌బాక్సెస్‌..  

26 Jul, 2022 02:56 IST|Sakshi

ఆఫీసులో నిద్ర వస్తోందా? అయితే భోజనం చేసిన తరువాత హాయిగా నిద్రపోవచ్చు. కాకపోతే ఇక్కడ కాదు.. జపాన్‌లో. నిద్ర పునరుత్తేజాన్నిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. రోజంతా అధిక పనితో అలసిపోయినా... రాత్రి మంచి నిద్రతో మరునాడు ఉత్సాహంగా పనిచేస్తాం. మరి పగటిపూట అధిక పనిగంటల వల్ల అలసిపోతే..? అది ఉత్పాదకతను దెబ్బతీస్తుంది. సీఎన్‌బీసీ తాజా నివేదిక ప్రకారం.. ప్రపంచంలో అత్యధిక గంటలు పనిచేసేది జపనీయులేనట.

అందుకే పది గంటలకు పైగా పనిచేయించుకునే రెండు జపాన్‌ కంపెనీలు పరిష్కారమార్గాన్ని కనిపెట్టాయి. నిద్రలేమితో బాధపడుతున్న తమ ఉద్యోగుల కోసం టోక్యోకి చెందిన ఫర్నిచర్‌ కంపెనీ ఇటోకీ, ప్లైవుడ్‌ కంపెనీ కొయొజు గోహన్‌ సంస్థలు సంయుక్తంగా న్యాప్‌బాక్స్‌ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చాయి. మధ్యాహ్నం భోజనం తరువాత కొద్దిసేపు ఆ న్యాప్‌ బాక్సుల్లో కునుకుతీయొచ్చు. కొద్దిపాటి పవర్‌న్యాప్‌ తరువాత మళ్లీ కొత్త శక్తితో పనిచేయొచ్చన్నమాట.

ఆహా... బెడ్‌ మీద హాయిగా అడ్డం ఒరిగేయొచ్చని ఆనందించకండి. అవి నిట్టనిలువునా ఉండే బాక్సెస్‌. వీటిని ‘కమిన్‌ బాక్సెస్‌’అంటున్నారు. ఫ్లెమింగోలాగా నిలబడే నిద్రపోవాలన్నమాట. అయితే తల, మోకాళ్లకు ఇబ్బంది లేకుండా, మనిషి పడిపోకుండా సౌకర్యవంతమైన సపోర్ట్‌ సిస్టమ్‌ ఉంటుందని చెబుతున్నారు. పనినుంచి తప్పించుకోవడానికి ఉద్యోగులు బాత్రూమ్‌లో ఎక్కువ సేపు గడిపేకంటే.. ఈ కమిన్‌ బాక్సెస్‌లో కునుకు బెటర్‌ అని ఇటోకి కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ సీకో కవాషిమా చెబుతున్నారు.

అయితే... బ్లూమ్‌బర్గ్‌ దీన్ని ట్విట్టర్‌ వేదికగా పంచుకోగా... నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఆరోగ్యకరమైన పని పరిస్థితులని ఒకరు మెచ్చుకుంటే... శవపేటికలను తలపిస్తున్న వాటిలో పడుకోవడం ఊహించడానికే కష్టంగా ఉందని మరొకరు కామెంట్‌ చేశారు. వీటికంటే పాశ్చాత్య దేశాల్లోని స్లీపింగ్‌ రూమ్స్‌లా సౌకర్యవంతంగా ఏర్పాటు చేస్తే మంచిదని ఇంకొకరు సలహా ఇచ్చారు.   

మరిన్ని వార్తలు