పదేళ్లుగా ఇంట్లోనే.. బయటకు రావాలంటే సిగ్గట..!

28 Jun, 2021 12:20 IST|Sakshi
పదేళ్లుగా ఇంటికే పరిమితమైన నిటో సౌజీ

కటింగ్‌ చేయించుకోవడానికి మాత్రమే బయటకు

వైరలవుతోన్న జపాన్‌ ఇండీ గేమ్‌ డెవలపర్‌ కథనం

టోక్యో: కరోనా వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి సామాజిక దూరం, ఐసోలేషన్‌ మన జీవితాల్లో భాగమైంది. ఏదైనా ముఖ్యమైన పని ఉండి వేరే ప్రాంతానికి వెళ్తే.. తిరిగి వచ్చాక స్నానం చేయడం.. రెండు, మూడు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండటం తప్పనిసరిగా మారింది. అయితే మనం కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత ఇలా ఐసోలేషన్‌లో ఉంటుంటే.. కొందరు మాత్రం ఎప్పటినుంచో ఈ సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. ఏళ్ల తరబడి జనాలకు దూరంగా.. ఇంటికే పరిమితమవుతున్నారు. జపాన్‌కు చెందిన నిటో సౌజీ ఈ కోవకు చెందిన వ్యక్తే. గత పదేళ్లుగా ఇతడు ఇంట్లోనే ఉంటున్నాడు. కేవలం కటింగ్‌ చేయించుకోవడం కోసం మాత్రమే బయటకు వస్తున్నాడు. 

ఆ వివరాలు.. ప్రొఫెషనల్ ఇండీ గేమ్ డెవలపర్ అయిన సౌజీ 10 సంవత్సరాల క్రితం తన స్వస్థలమైన టోక్యోకు తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి బయటకు వెళ్లడం మానేశాడు. రెండు, మూడు నెలలకోసారి కేవలం కటింగ్‌ చెయించుకోవడం కోసం మాత్రమే బయటకు వస్తాడు. ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, దుస్తులు, ఇతరాత్ర వాటి కోసం ఆన్‌లైన్‌ షాపింగ్‌ మీద ఆధారపడతాడు. తనకు కావాల్సిన వాటిని ఆన్‌లైన్‌లో బుక్‌ చేసి.. డోర్‌ డెలివరీ చేయించుకుంటాడు. బయటకు వెళ్లడానికి చాలా సిగ్గుపడతాడు.. భయపడతాడు సౌజీ.

సౌజీ ఒక యూట్యూబ్‌ చానెల్‌ని కూడా రన్‌ చేస్తున్నాడు. దీనిలో తన రోజువారి జీవితానికి సంబంధించిన వీడియోలను పోస్ట్‌ చేస్తాడు. మన జీవితం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైతే.. సౌజీ మాత్రం రాత్రి ఎనిమిద గంటలకు తన కార్యకాలపాలను ప్రారంభించి తెల్లవారుజామున 4 గంటలకు నిద్రపోతాడు. మొదటి రెండు మూడు సంవత్సారాలు ఈ విధానం తనకు బాగా మేలు చేసిందని.. ఎంతో ఏకాగ్రతగా పని చేసుకునేవాడినన్నాడు. కానీ రాను రాను బయటకు వెళ్లాలంటే సిగ్గుగా, భయంగా అనిపించేది అన్నాడు సౌజీ.

సౌజీ పాటించే జీవన విధానాన్ని ‘‘హికికోమోరి’’ అని పిలుస్తారు. అంటే సమాజం నుంచి పూర్తిగా వైదొలగి సామాజిక ఒంటరితనం, నిర్బంధంలో తీవ్ర స్థాయిని కోరుకోవడం. సాధారణంగా జపాన్‌లో సగానికి పైగా యువత, వృద్ధులు ఈ విధానాన్ని పాటిస్తున్నారు.. కానీ సౌజీ అంత కఠినంగా మాత్రం కాదు. 

చదవండి: Coronavirus: శ్మశానవాటికలోనే ఐసోలేషన్‌

మరిన్ని వార్తలు