వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. అయినా స్మోక్‌ చేయకూడదు!

3 Sep, 2021 15:17 IST|Sakshi

టోక్యో: ప‌ని చేస్తున్న స‌మ‌యంలో రిలీఫ్‌ కోసమో లేక పని ఒత్తిడి కారణంగానో కొంతమంది ఉద్యోగులు సిగ‌రెట్ల‌ని పదే పదే తాగుతూ ఉంటారు. అయితే ఈ క్రమంలో కొందరికి అది అతి పెద్ద వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. దీని వల్ల ఆ ఉద్యోగి ఆరోగ్యానికే కాకుండా సంస్ధకు కూడా నష్టం వాటిల్లుతుంది. ఆఫీస్‌లో పని చేసే ఉద్యోగ స‌మ‌యాన్ని పూర్తిగా  స‌ద్వినియోగం చేసుకోవాల‌నే ఏ కంపెనీ అయినా భావిస్తుంది. 

అందుకే జపాన్‌లోని అతిపెద్ద బ్రోకరేజ్ సంస్థ నోమురా హోల్డింగ్స్ .. తన ఉద్యోగులు వ‌ర్క్ ఫ్ర‌మ్ చేస్తున్నా స‌రే ప‌ని చేస్తున్న స‌మ‌యంలో స్మోకింగ్ చేయ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ కొత్త రూల్‌ అక్టోబ‌ర్ నుంచి అమల్లోకి రానున్నట్లు ఉద్యోగులకు తెలిపింది. త్వరలోనే ఆ సంస్థ నిర్వ‌హిస్తున్న అన్ని స్మోకింగ్ రూమ్‌ల‌ను కూడా మూసివేయాల‌ని కూడా నిర్ణ‌యించింది. మ‌రి ఇంట్లో ఉద్యోగి స్మోక్ చేస్తే వారికి ఏమైనా శిక్షలు విధించే అవకాశాలు ఉన్నాయా అనే సందేహం కలగడం సహజం. ఇందుకు నోమురా ప్రతినిధి యోషితకా ఓట్సు మాట్లాడుతూ..  దీనికోసం ప్ర‌త్యేకంగా తామేమీ ఉద్యోగిపై నిఘా ఉంచ‌బోమ‌ని, వాళ్ల‌పై త‌మ‌కు న‌మ్మ‌కం ఉంద‌ని తెలిపారు.

ప‌ని వాతావ‌ర‌ణాన్ని మెరుగుప‌ర‌చి, స్మోక్ చేస్తున్న వాళ్ల వ‌ల్ల మిగ‌తా వాళ్ల‌పై ఆరోగ్యాల‌పై ప్ర‌భావం ప‌డ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలిపింది. పూర్తి ఆరోగ్యంతో ఓ ఉద్యోగి త‌న పూర్తి సామ‌ర్థ్యం మేర‌కు సేవ‌లందించాల‌ని సంస్థ భావిస్తున్న‌ట్లు ఒక ప్ర‌క‌ట‌న‌లో చెప్పింది. త‌మ ఉద్యోగుల్లో 2020 మార్చి నాటికి 20 శాతం మంది స్మోక‌ర్లు ఉండ‌గా.. 2025 నాటికి దానిని 12 శాతానికి త‌గ్గించాల‌నే ల‌క్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు.

చదవండి: World Skyscraper Day 2021: మొట్టమొదటి ఆకాశ హార్మ్యం ఏది? ఎవరు కట్టారో తెలుసా?

మరిన్ని వార్తలు