జెఫ్‌ బెజోస్‌ కీలక నిర్ణయం..! ఏకంగా తన సోదరుడితో కలిసి..

7 Jun, 2021 20:11 IST|Sakshi

వాషింగ్టన్‌: మానవ సహిత అంతరిక్ష ప్రయాణాలను మరింత సులువు చేయడం కోసం స్పేస్‌ ఎక్స్‌, బ్లూ ఆరిజిన్‌ లాంటి కంపెనీలు ప్రయత్నాలను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. కాగా స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ఇప్పటికే నాసాతో కలిసి మానవ సహిత అంతరిక్ష యాత్రలను దిగ్విజయంగా పూర్తి చేస్తోంది. అంతేకాకుండా అంగారక గ్రహంపైకి మానవులను పంపాలనే దృఢ సంకల్పంతో ఎలన్‌ కంపెనీ స్పేస్‌ ఎక్స్ ఇప్పటికే అంతరిక్షనౌక ప్రయోగాల దృష్టిసారించింది. కాగా మానవ సహిత అంతరిక్ష ప్రయోగాల్లో జెఫ్‌ బెజోస్‌ కంపెనీ  బ్లూ ఆరిజిన్‌ సంస్థ కీలక ఘట్టానికి చేరుకుంది. బ్లూ ఆరిజిన్‌ తన తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగాన్ని నిర్వహించడానికి సిద్థమైంది. 

బ్లూ ఆరిజిన్‌ ప్రయోగించే మానవ సహిత అంతరిక్ష ప్రయోగంలో ఆస్ట్రోనాట్స్‌తో పాటుగా, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌  ప్రయాణించనున్నాడు. జెఫ్‌ బెజోస్‌ అతని సోదరుడు మార్క్‌ బెజోస్‌తో కలిసి ప్రయాణించనున్నాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో తెలుపుతూ జెఫ్‌ బెజోస్‌ భావోద్వేగానికి గురైయ్యాడు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.  ‘ అంతరిక్షంలో ప్రయాణించాలనే నా కల ఈ జూలై 20 న నెరవెరబోతుంది. ఈ ప్రయాణాన్ని నా సోదరుడుతో కలిసి పాలుపంచుకుంటున్నాను. అంతేకాకుండా అంతరిక్షం నుంచి భూమిని చూస్తే మనం మారిపోతాము. భూ గ్రహంతో ఉన్నఅనుబంధం కూడా మారిపోతుంద’ని వీడియోలో తెలిపాడు.

 బ్లూ ఆరిజిన్‌ తొలి అంతరిక్ష యాత్ర
అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ బ్లూ ఆరిజిన్‌ ఎరోస్పేస్‌ సంస్థను 2000 సంవత్సరంలో నెలకొల్పాడు. బ్లూ ఆరిజిన్‌ తొలి అంతరిక్ష నౌకకు ‘న్యూ షెపార్డ్‌ ’గా నామకరణం చేశారు. ఈ అంతరిక్ష యాత్రను జూలై 20 న ప్రయోగించనున్నారు. ప్రస్తుతం ఈ అంతరిక్ష యాత్రలో నౌక సిబ్బంది, బెజోస్‌ బ్రదర్స్‌తో పాటుగా.. ఈ ప్రయాణం కోసం అత్యధికంగా బిడ్‌ చేసిన వారు ప్రయాణిస్తారు. కాగా అందుకు సంబంధించిన వేలాన్ని మే 5 నుంచి ఆన్‌లైన్‌లో  బ్లూ ఆరిజిన్‌ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ వేలం జూన్‌ 10 వరకు లైవ్‌లో ఉండనుంది. ప్రస్తుతం ఇప్పటివరకు ఈ ప్రయాణం కోసం సుమారు 21 కోట్ల అత్యధిక బిడ్‌ను వేశారు. కాగా ఈ ప్రయోగం కేవలం పది నిమిషాల వ్యవధిలో పూర్తి కానుంది.

A post shared by Jeff Bezos (@jeffbezos)

మరిన్ని వార్తలు