గేట్స్‌ దంపతుల విడాకులు: కుమార్తె భావోద్వేగం

5 May, 2021 14:01 IST|Sakshi
భార్యా పిల్లలతో బిల్‌ గేట్స్‌

వాషింగ్టన్‌: ‘‘నా తల్లిదండ్రులు విడిపోతున్నారన్న వార్త మీలో చాలా మంది వినే ఉంటారు. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో, నా భావోద్వేగాలు ఎలా అదుపు చేసుకోవాలో అర్థం కావడం లేదు. నా కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలిచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాను. అమ్మానాన్నల విడాకులపై వ్యక్తిగతంగా నేనేమీ కామెంట్‌ చేయదలచుకోలేదు. కానీ ఈ సమయంలో మీరిచ్చే మద్దతు నాకెంతో ఊరట కలిగిస్తుంది’’ అంటూ గేట్స్‌ దంపతుల పెద్ద కుమార్తె జెన్నిఫర్‌ గేట్స్‌ భావోద్వేగానికి లోనయ్యారు. తన తల్లిదండ్రులు ఇకపై కలిసి ఉండబోవడం లేదని, ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎలా అధిగమించాలో తెలియడం లేదంటూ ఉద్వేగానికి గురయ్యారు.

కాగా సతీమణి మిలిందాతో 27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని, గేట్స్‌ ఫౌండేషన్‌ కార్యక్రమాల్లో మాత్రం భాగస్వాములుగానే ఉంటామని స్పష్టం చేశారు. ఈ విషయంపై స్పందించిన జెన్నిఫర్‌ ఇన్‌స్టా వేదికగా ఈ మేరకు తన మనసులోని భావాలు పంచుకున్నారు. తమ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని, తమకు అండగా నిలిచిన వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కాగా 1994లో బిల్‌, మిలిందా వివాహ బంధంతో ఒక్కటయ్యారు.  వారికి ఇద్దరు కూతుళ్లు జెన్నిఫర్‌ కేథరీన్‌ (25), ఫేబీ అడేల్‌ (18), కొడుకు రోనీ జాన్‌ (21) సంతానం. ప్రస్తుతం బిల్‌గేట్స్‌ వయస్సు 65 ఏళ్లు కాగా, మిలిందా వయస్సు 56 ఏళ్లు.

చదవండి: వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్న మిలిందా- బిల్‌ గేట్స్‌
అత్యంత ఖరీదైన విడాకులు: భార్యలకు ఎంత చెల్లించారంటే!

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు