అమెరికన్‌ యుద్ధ నౌకను చుట్టుముట్టిన యూఎఫ్‌ఓలు

29 May, 2021 15:26 IST|Sakshi
జెరెమీ కోర్‌బెల్‌ షేర్‌ చేసిన వీడియోలో నుంచి తీసుకున్న ఫోటో

వీడియో షేర్‌ చేసిన దర్శకుడు జెరెమీ కోర్‌బెల్‌

వీడియో ప్రామాణికమైనదే అంటున్న పెంటగాన్‌

వాషింగ్టన్‌: యూఎఫ్‌ఓల (అన్‌ఐడెంటిఫైడ్‌ ఫ్లయింగ్‌ ఆబ్జెక్ట్‌) గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికి ఆసక్తే. ఇప్పటికే చాలా మంది తాము యూఎఫ్ఓ‌లను చూశామని ప్రకటించారు. వీరి వ్యాఖ్యలను నమ్మే వారు ఎందరుంటారో.. కొట్టి పారేసేవారు కూడా అంతే మంది ఉంటారు. ఈ క్రమంలో యూఎఫ్‌ఓలు ఉన్నాయనే వాదనకు బలం చేకూర్చింది అమెరికన్‌ నేవీ. కొద్ది రోజుల క్రితం యూఎస్‌ నేవీ యూఎఫ్‌ఓలకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2019లో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు అమెరికన్‌ నేవీ తెలిపింది. 

ఈ క్రమంలో పరిశోధనాత్మక చిత్రాల దర్శకుడు జెరెమీ కోర్‌బెల్‌ అదే సంఘటనకు సంబంధించిన మరో వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. దీనిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 యూఎఫ్‌ఓలు ఉన్నాయి. ఇవి అమెరికన్‌ నేవీ యుద్ధ నౌక ఒమాహాను చుట్టుముట్టినట్లు కోర్‌బెల్‌ తెలిపాడు. వీటి వేగం గంటకు 70-250 కిలోమీటర్ల వరకు ఉందని.. ఒమాహాతో పోల్చితే మూడు రెట్లు వేగవంతమైనవని కోర్‌బెల్‌ వెల్లడించాడు. రాడార్‌ స్క్రీన్‌ మీద ఈ యూఎఫ్‌ఓలు కనిపించాయన్నాడు కోర్‌బెల్‌.

కోర్‌బెల్‌ ప్రకారం, ఈ వీడియోను ఓడ కమాండ్ సెంటర్‌లో చిత్రీకరించారని.. ఫుటేజ్‌ని ఇంకా వర్గీకరించలేదన్నాడు. ఇతను గతంలో అన్‌ఐడెంటిఫైడ్‌ ఏరియల్ ఫినామినా టాస్క్ ఫోర్స్(యూఏపీటీఎషఫ్‌) దగ్గర ఉన్న ఫోటోలను షేర్‌ చేశాడు. వీటిని అమెరికన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ డిఫెన్స్‌, పెంటగాన్ కూడా ధ్రువీకరించింది.

పెంటగాన్ ప్రతినిధి సుసాన్ గోఫ్ ఏప్రిల్‌లో ది బ్లాక్ వాల్ట్‌తో మాట్లాడుతూ.. "యూఏపీటీఎఫ్‌ ఈ సంఘటనలను వారి కొనసాగుతున్న పరీశోధనలలో చేర్చింది" అని వెల్లడించారు. మే 15 న కోర్‌బెల్ షేర్‌ చేసిన వీడియోలో, “గోళాకార” యూఎఫ్‌ఓ ఒకటి సముద్రంలో అదృశ్యమైనట్లు పెంటగాన్ మరోసారి ధ్రువీకరించింది. కోర్‌బెల్ గతంలో విడుదల చేసిన ఫుటేజ్‌ ప్రామాణికమైనదని.. టాస్క్ ఫోర్స్ యూఎఫ్‌ఓల కదలికలను పరిశీలిస్తున్నట్లు అమెరిక రక్షణ శాఖ తెలిపింది. 

చదవండి: ‘‘ఏలియన్స్‌ నన్ను 50 సార్లు కిడ్నాప్‌ చేశారు’’

మరిన్ని వార్తలు