చంద్రుడి పైకి తొలి మహిళ!

25 Jan, 2021 00:02 IST|Sakshi

ఆకాశంలో సగం అనే నానుడిని నిజం చేస్తూ మగువ అన్ని రంగాల్లో మగవాడికి దీటుగా దూసుకుపోతోంది. ఏరంగంలో పురుషులకు తీసిపోమంటూ అంతరిక్ష ప్రయాణం కూడా పూర్తి చేసుకున్న స్త్రీ శక్తి త్వరలో చంద్రుడిపై కాలు మోపేందుకు సిద్ధమవుతోంది. 1969లో నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్‌ అల్‌డ్రైన్‌లు తొలిసారి చంద్రోపరితలంపై కాలుపెట్టారు. వీరితో కలిసి ఇంతవరకు 12 మంది పురుషులు చంద్రుడిపైకి విజయవంతంగా వెళ్లి తిరిగి వచ్చారు.

కానీ ఇంతవరకు ఒక్క మహిళా వ్యోమగామికి ఈ అవకాశం రాలేదు. కానీ ఈ దఫా అమెరికా నాసా సంస్థ తమ ఆర్టిమిస్‌ మిషన్లో భాగంగా తొలిసారి చందమామపైకి మహిళా వ్యోమోగామిని పంపాలని యోచిస్తోంది. ఇందుకోసం బ్రౌన్‌ యూనివర్సిటీకి చెందిన డా. జెస్సికా మెయిర్‌ను ఎంపిక చేసుకుంది. ప్రస్తుతం ఈమె ఆర్టిమిస్‌ మూన్‌ లాండింగ్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొనే మరో 17మంది ఆస్ట్రోనాట్లతో కలిసి శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. చంద్రయానానికి అవకాశం వచ్చిన తొలి మహిళ కావడం తనకెంతో సంభ్రమాన్ని కలిగించిందని జెస్సికా చెబుతోంది. చంద్రుడి ఉపరితలంపై నడిచేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటోంది.

మిషన్‌లో అంతిమంగా పాల్గొనే ఆస్ట్రోనాట్ల పేర్లు ఇంకా అధికారికంగా ఖరారు కాకపోయినా, తప్పక తనను ఎంచుకుంటారని ఆమె ధీమాగా ఉంది. చివరి నిమిషంలో ఒకవేళ మూన్‌ జర్నీ అవకాశం తప్పిపోయినా బాధపడేది లేదని, తాను వెళ్లకపోయినా, తన కొలీగ్స్‌లో ఒకరు వెళ్తున్నారనే తృప్తి చాలని చెబుతూ పెద్దమనసు చాటుకుంది. రాబోయే ఆర్టిమిస్‌ మిషన్‌ కేవలం చంద్రుడిపైకి అలా వెళ్లి ఇలా రావడం కోసం కాదని, భవిష్యత్‌లో మార్స్‌ ప్రయాణాలకు ఇది మార్గదర్శకమవుతుందని వివరించింది. అలాగే చంద్రుడిపై ఒక శాశ్వత మానవ కాలనీ నిర్మాణానికి సంబంధించి ఈ మిషన్‌ తొలిమెట్టుగా మారవచ్చని నిపుణుల అంచనా.

మరిన్ని వార్తలు