ఎవరీ జో జోర్గెన్‌సన్‌

22 Nov, 2020 11:29 IST|Sakshi

విధ్వంసం.. పురుషుడి అభిమతం.. నిర్మాణం.. స్త్రీ లక్షణం..
దాదాపు ప్రతి ఇల్లే కాదు ప్రపంచ రాజకీయ తాజా పరిణామాలూ ఇవే చెప్తున్నాయి.  ఇంటిని  చక్కదిద్దినంత తేలికగా తమ పాలనలో ఉన్న దేశాల ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యలను చక్కదిద్దుతున్నారు. ఈ నిజాన్ని కరోనా కూడా ప్రూవ్‌ చేసింది. మహిళలు ఏలికలుగా ఉన్న దేశాల్లో కరోనా కూడా కోరలు ముడుచుకుంది. కాదు ముడుచుకునేలా చేశారు. విధ్వంసంతో సవాళ్లను విసురుతూ ఉన్న పురుషులకు నిర్మాణంతో జవాబు ఇస్తున్నారు. అలాంటి సవాలే స్వీకరించింది ఓ స్త్రీ అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పోరులో నిలబడి. ఆమె పేరు జో జోర్గెన్‌సన్‌. వయసు..63. కమలా హారిస్‌ గెలుపు ముందు ఆమె ప్రయత్నం కనిపించకుండాపోయింది.

అమెరికాలో నడుస్తున్న ద్విపార్టీ తీరును వ్యతిరేకించే, నిరసించే సమూహంలోని వ్యక్తి జోర్గెన్‌సన్‌. లిబర్టేరియన్‌ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ చేసిన తొలి మహిళ ఆమె. ఈ పార్టీ విజయావకాశాలు,  పదవుల అర్హత వగైరాల చర్చ కాదు. నిర్మాణాత్మాక స్ఫూర్తి మాత్రమే సందర్భం. అందుకే జోర్గెన్‌సన్‌ పరిచయం. ఆమె మీద కరడుగట్టిన రిపబ్లికన్స్‌ అంతా గుర్రుమంటున్నారట. రిపబ్లికన్స్‌ ఖాతాలో పడాల్సిన జార్జియా రాష్ట్రం బైడెన్‌ వశం కావడానికి జోర్గెన్‌సనే కారణమని. అవును  ఆమె వల్లే ట్రంప్‌ ఓట్లు చీలాయి. ఈ ఎన్నికల్లో జోర్గెన్‌సన్‌కు పదహారు లక్షల ఓట్లు పడ్డాయి. 

ఆమె ప్రజలకు ఇచ్చిన మాట... నిర్మాణమే. 
యుద్ధమనే విధ్వంసం వద్దంది. వనరుల స్వాధీనం కోసం ప్రపంచ దేశాలతో అమెరికా చేస్తున్న ఆధిపత్యపోరును తీవ్రంగా వ్యతిరేకించింది. విదేశాల్లో ఉన్న అమెరికా సైనికులను వెనక్కి పిలిపించాలని గళమెత్తింది. మూకుమ్మడిగా ఖైదు చేయడాన్ని,  అమెరికా సమాఖ్య ప్రభుత్వ ప్రణాళికలను నిరసించింది. తను అధ్యక్షపదవిలోకి వస్తే అమెరికాను నిరాయుధ దేశంగా మలుస్తానని, ప్రపంచ దేశాల వ్యవహారాల్లో తలదూర్చకుండా ... హింసను ప్రేరేపించకుండా, తటస్థంగా ఉండేలా చూస్తానని చెప్పింది జోర్గెన్‌సన్‌. తను ఎన్నికైన మరుక్షణమే ప్రపంచ దేశాల్లోని  అమెరికా మిలటరీ ఆపరేషన్స్‌ను నిలిపేసి.. ఆ సైన్యాన్ని స్వదేశానికి రప్పిస్తానని,  విదేశాలకు అందించే ఫండ్‌ను ఆపేస్తానని చెప్పింది. సమాఖ్య ప్రభుత్వం విధించే ఇన్‌కమ్‌టాక్స్‌ను రద్దు చేస్తానని మాటిచ్చింది. అమెరికా పౌరుల వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు పాటుపడుతూ అమెరికాను సర్వశక్తి దేశంగా తీర్చిదిద్దుతామని, క్రిమినల్‌ జస్టిస్‌లో మార్పు తీసుకొస్తామనీ  విన్నవించుకుంది జోర్గెన్‌సన్‌. 

‘నేను రాజకీయాల పక్షం కాదు, బ్యూరోక్రాట్స్‌ పక్షమూ కాదు.. వాషింగ్‌టన్‌లోని పైరవీకారుల పక్షం అసలే కాదు. నేను ప్రజల పక్షం.. అంటే మీ పక్షం. ఇప్పుడున్న రెండు పార్టీలకూ ప్రజాప్రయోజనాల కన్నా వాషింగ్‌టన్‌లోని స్పెషల్‌ ఇంట్రెస్ట్‌లే ముఖ్యం. ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సామాజిక భద్రత, ఆరోగ్య రక్షణ వంటి ఎన్నో హామీలను తుంగలో తొక్కింది. ప్రధానంగా అమెరికా స్థానిక ప్రజలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వాళ్లను తమ పౌరులుగా గుర్తించనేలేదు’ అంది ఆమె. 

ఆ ఉపన్యాసానికి ఆకర్షితులయ్యారు ప్రజలు. అమెరికా ఎన్నికల ప్రచారాన్ని గమనిస్తున్న ప్రపంచ ప్రేక్షకులకూ ఆసక్తి గలిగింది. ఆమె తలపెట్టిన అమెరికా పునర్నిర్మాణపు ఆలోచనలు నచ్చాయి. అమెరికా ప్రెసిడెంట్‌ ఎన్నిక మీద ప్రపంచ దేశాలు ప్రధానంగా ఆసియా దేశాలు.. ఇంకా చెప్పాలంటే ట్రంప్‌ గెలుపు ఓటముల మీద రైట్‌వింగ్‌ రాజకీయ భవిష్యత్తును అంచనా వేసుకుని  సంబరపడ్డమో.. బాధపడ్డమో చేసే (వాణిజ్యం, వీసా వంటి లెక్కలు కాకుండా) దేశాలకూ జోర్గెన్‌సన్‌ ఆలోచనా విధానం సంతోషాన్ని కలిగించే విషయం. పెత్తనాల జోలికి వెళ్లకుండా సొంత కుంపట్లో ఎగసిపడ్తున్న నిప్పురవ్వల మీద అమెరికా దృష్టి పెట్టుకుంటే అంతకన్నా ప్రపంచ దేశాలకు కావాల్సిందేముంటుంది? మహిళ కాబట్టే ఆ సమస్యను గ్రహించింది. మహిళ కాబట్టే ఆ సవాలును స్వీకరించే చొరవ చూపించింది. పోరులో నిలబడింది. 

ప్రస్తుతం ప్రపంచంలోని ఇరవైమూడు దేశాల్లో ఇలాంటి స్త్రీ శక్తే అధికారంలో ఉంది. ప్రజలకు చేతినిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా కునుకు ఉండే భద్రతను కల్పిస్తోంది. ప్రతి పౌరుడి ఆత్మగౌరవానికి రక్షణగా నిలస్తోంది. అందుకే ప్రపంచానికి కావల్సింది వైషమ్యాల విధ్వంసం కాదు.. సమైక్యనిర్మాణం.

నిర్మొహమాటం, ధైర్యం, చొరవ కలిస్తే డాక్టర్‌ జో జోర్గెన్‌సన్‌.  
సౌత్‌ కరోలినాలోని క్లెమ్సన్‌ యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్‌ ఆమె. హాకీ ప్లేయర్‌ కూడా.  సైకాలజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. జోర్గెన్‌సన్‌లో వ్యాపార దక్షతా మెండే. 1980లో ఏంబీఏ చదివింది. ఐబీఎంలో మార్కెటింగ్‌ రిప్రజెంటేటివ్‌గా చేరింది. తర్వాత సొంతంగా సాఫ్ట్‌వేర్‌ బిజినెస్‌ ప్రారంభించింది. పెళ్లి, పిల్లలతో కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తూనే తన కెరీర్‌కూ బ్రేక్‌ పడకుండా చూసుకుంది. 1983లో లిబర్టేరియన్‌ పార్టీలో సభ్యత్వం తీసుకుంది. 2002లో సైకాలజీలో పీహెచ్‌డీ చేసింది. 2006 నుంచి ప్రొఫెసర్‌గా కొనసాగుతోంది. రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే. 
-శరాది

మరిన్ని వార్తలు