అమ్మానాన్నలపై కేసు పెట్టిన పుత్రరత్నం

11 Mar, 2021 10:18 IST|Sakshi

లండన్‌: అవకాశం ఇస్తే అమ్మానాన్న మీద పడి బతికేవాళ్ళు ప్రపంచంలో చాలా మందే ఉన్నారనిపిస్తోంది ఇది చదివితే. ఏదో కాలో చెయ్యో సరిగ్గా లేదనుకుంటే సరే. కానీ అన్నీ ఉండీ, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో డిగ్రీ పొంది కూడా తల్లిదండ్రులపైనే భారంమోపాలని భావిస్తున్నారు నాలుగు పదులు దాటిన ఓ పుత్రరత్నం. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందిన  41 ఏళ్ళ దుబాయ్‌కి చెందిన ఫయాజ్‌ సిద్దిఖీ అనే వ్యక్తి ఇటీవల తన తల్లిదండ్రులపై ఓ విచిత్రమైన దావా వేశారు. తాను జీవించి ఉన్నంత కాలం తన తల్లిదండ్రులే తనకి ఆర్థిక సాయం చేయాలంటూ సదరు కుమారుడు కోర్టుకెక్కారు.

ధనవంతులైన తన తల్లిదండ్రులే తన భారాన్ని జీవిత కాలం మోయాలంటూ కేసుపెట్టారు. అందుకు కారణం తన ఆరోగ్య సమస్యలని చెప్పారు సిద్దిఖీ. తన తల్లిదండ్రుల నుంచి డబ్బు రాకపోతే తన మానవ హక్కులు ఉల్లంఘనకు గురైనట్టేనంటారీయన. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందిన సిద్దిఖీ, కొన్ని చట్టపరమైన సంస్థల్లో పని కూడా చేశారు. అయితే 2011 నుంచి ఈయన నిరుద్యోగిగా ఉన్నారు. అంతేకాదు తనకి ఫస్ట్‌క్లాస్‌ రాకపోవడానికి ఆక్స్‌ఫర్డ్‌యూనివర్సిటీయే  కారణమంటూ యూనివర్సిటీపై కూడా మూడేళ్ళ క్రితం దావా వేసేందుకు ప్రయత్నం చేశారు. అక్కడ టీచింగ్‌ బాగాలేదని, అది తన కెరీర్‌కి నష్టం చేసిందని సిద్దిఖీ వాదించారు. 

లండన్‌లోని హైడ్‌ పార్క్‌లో ఉన్న కోట్ల రూపాయల విలువ చేసే తమ ఫ్లాట్‌లో తమ కొడుకుని 20 ఏళ్ళుగా ఎటువంటి అద్దె లేకుండా ఉచితంగా ఉండనిస్తున్నామని సిద్దిఖీ తల్లిదండ్రులు రక్షందా, జావేద్‌లు చెప్పారు. అంతేకాదు సిద్దిఖీ తల్లిదండ్రులు, తమ కొడుకు బిల్లులు కట్టడమే కాకుండా, ప్రతి వారం కొంత అదనంగా పంపిస్తున్నారు. అయితే కుటుంబ తగాదాల నేపథ్యంలో ఇప్పుడు తమ కొడుకు సిద్దిఖీకి చేస్తోన్న ఆర్థిక తోడ్పాటులో కోత విధించాలని వారు భావిస్తుండడంతో సదరు కుమారుడు తల్లిదండ్రులపై కేసు పెట్టాడు. తాను తన తల్లిదండ్రుల నుంచి జీవితకాలం ఆర్థిక సాయం పొందేందుకు అర్హుడినని ఆయన వాదిస్తున్నారు. మెయింటెనెన్స్‌ కోరుతూ సిద్దిఖీ దాఖలు చేసిన పిటిషన్‌ని గత ఏడాది ఫామిలీ కోర్టు తోసిపుచ్చింది. యిప్పుడది ఎగువ కోర్టులో విచారణకు వచ్చింది.  

మరిన్ని వార్తలు