ఫెడరల్‌ ఏజెన్సీల్లో అమెరికన్లకే ఉద్యోగాలు 

5 Aug, 2020 03:46 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా జాబ్‌ మార్కెట్‌పై ఆశలు పెట్టుకున్న భారతీయులకు మరో దుర్వార్త. అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని దేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలను ఆదేశిస్తూ సోమవారం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. విదేశీయులు, ముఖ్యంగా హెచ్‌1బీ వీసాదారులకు ఫెడరల్‌ ఏజెన్సీల్లో ఉద్యోగావకాశాలు కల్పించకూడదని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ‘అన్ని ప్రభుత్వ సంస్థలు నాలుగు నెలల్లోగా అంతర్గత ఆడిటింగ్‌ పూర్తి చేసుకుని, ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న నిబంధనల ప్రకారమే మానవ వనరులు ఉండేలా చూసుకోవాలి’ అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి వరకు హెచ్‌ 1బీ వీసాలతో పాటు పలు ఇతర వర్క్‌ వీసాలను నిలిపేస్తూ ఇప్పటికే యూఎస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

కరోనా మహమ్మారి కారణంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోతున్న స్వదేశీయులకు ఊరట కల్పించే దిశగా ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘అమెరికన్లకే ఉద్యోగాలు అనే సింపుల్‌ సిద్ధాంతాన్నే ఈ ప్రభుత్వం ఆచరిస్తుంది. అందుకు సంబంధించిన ఒక ఉత్తర్వుపై ఈ రోజు సంతకం చేయబోతున్నాను’ అని ట్రంప్‌ సోమవారం పేర్కొన్నారు. చవకగా లభించే విదేశీ ఉద్యోగి కోసం కష్టపడి పనిచేసే అమెరికన్‌ను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని తన ప్రభుత్వం సహించబోదన్నారు. ‘అమెరికన్లకు ఉద్యోగావకాశాలు కల్పించే అత్యున్నత నైపుణ్యాలు కలిగిన విదేశీయులకు మాత్రమే హెచ్‌1బీ వీసాలు.. అంతేకాని అమెరికన్ల ఉద్యోగాలు లాక్కొనే వారికి కాదు’ అని స్పష్టం చేశారు. ‘త్వరలో కొత్త ఇమిగ్రేషన్‌ బిల్లుపై చర్చించబోతున్నాం. అది చాలా సమగ్రంగా ఉండబోతోంది’ అని ట్రంప్‌ ప్రకటించారు. 

మరిన్ని వార్తలు