చైనా ఆధిపత్యానికి చెక్‌: క్వాడ్‌ బలోపేతానికి కృషి 

18 Apr, 2021 10:58 IST|Sakshi
వైట్‌ హౌజ్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో జపాన్‌ ప్రధాని యోషిహిడే  

యూఎస్, జపాన్‌ ప్రతిన

వాషింగ్టన్‌: ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ఆధిపత్యానికి చెక్‌ చెప్పేందుకు ఏర్పడిన క్వాడ్‌ కూటమిని మరింతగా బలోపేతం చేయాలని, ఇందుకోసం భారత్, ఆ్రస్టేలియాతో కలిసి పనిచేయాలని యూఎస్, జపాన్‌ నిర్ణయించాయి. ఈ మేరకు శుక్రవారం వైట్‌హౌస్‌లో యూఎస్‌ ప్రెసిడెంట్‌ బైడెన్, జపాన్‌ ప్రధాని యోషిహిడేసుగా చర్చలు జరిపారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి ఒక విదేశీ నేతతో వైట్‌హౌస్‌లో బైడెన్‌ ముఖాముఖి చర్చించారు.

ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణ కల్పనకు మిత్రదేశాలతో కలిసి పనిచేస్తామని, క్వాడ్‌ను మరింత బలోపేతం చేస్తామని ఇరువురు నేతలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సహకారాన్ని మరింత పెంపొందిస్తామని చెప్పారు. కరోనా కారణంగా ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఆరోగ్య రంగంలో పరస్పర సహాయసహకారాలు అందించుకోవాలని  యూఎస్, జపాన్‌ నిర్ణయించుకున్నాయి. మయన్మార్‌లో హింసను ఇరు దేశాలు ఖండించాయి.  

చైనా చర్యలపై చర్చ : ఇండో పసిఫిక్‌ ప్రాంతంతో పాటు ప్రపంచంపై చైనా చర్యల వల్ల శాంతి, సామరస్యాలపై పడే ప్రభావం గురించి బైడెన్, సుగా చర్చించారు. దక్షిణ చైనా సముద్రంలో 13 లక్షల చదరపు మైళ్ల ప్రాంతం తమదేనని చైనా ప్రకటించడం వియత్నాం, మలేసియా, ఫిలిప్పీన్స్, బ్రునై, తైవాన్‌ దేశాల ఆందోళనకు కారణమవుతోంది. తూర్పు చైనా సముద్ర విషయంలో జపాన్‌తో చైనాకు వివాదాలున్నాయి. ఈ రెండు ప్రాంతాలు పలు విలువైన ఖనిజాలున్న ద్వీపాలకు ఆలవాలం కావడంతో చైనా ఏకపక్షంగా వీటిని తన స్వాధీనంలోకి తెచ్చుకునే యత్నాలు చేస్తోందని పొరుగు దేశాలు ఆరోపిస్తున్నాయి.

ఈ సముద్రప్రాంతాల్లో ప్రస్తుత స్థితికి భంగం కలిగించే ఏకపక్ష చర్యలను వ్యతిరేకిస్తామని యూఎస్, జపాన్‌ తమ సంయుక్త ప్రకటనలో తాజాగా స్పష్టం చేశాయి. ఈ ప్రాంతాల్లో ఐరాసా తీర్మానం ప్రకారం స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలుండాలని పేర్కొన్నాయి. హాంకాంగ్, ఉయ్‌ఘర్‌ ప్రాంతాల్లో సమస్యలపై ఆందోళనలున్నట్లు తెలిపాయి.
చదవండి: అమెరికాలో కాల్పులు: మృతుల్లో నలుగురు సిక్కులు

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు