నిప్పుతో చెలగాటం ఆడొద్దు.. బైడెన్‌కు ఫోన్‌లో జిన్‌పింగ్‌ హెచ్చరికలు

29 Jul, 2022 01:27 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ గురువారం ఫోన్‌లో సుదీర్ఘంగా వాడీవేడిగా సంభాషణలు సాగాయి. రెండు దేశాల అధ్యక్షుల మధ్య గురువారం జరిగిన ఐదో విడత చర్చలు ఉదయం 8.33 నుంచి 10.50 గంటల వరకు కొనసాగినట్లు శ్వేతసౌధం తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికంగా, రాజకీయంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో జరిగిన ఈ చర్చల్లో తైవాన్‌ అంశమే ప్రధానంగా నిలిచింది. రెండు దేశాల మధ్య సంబంధాల్లో క్షీణతకు అమెరికానే కారణమంటూ ఎప్పటి మాదిరిగానే చైనా నిందించింది. తైవాన్‌ ఎప్పటికైనా తమదేనంటూ చర్చల సందర్భంగా జిన్‌పింగ్‌ గట్టిగా చెప్పారని చైనా పేర్కొంది. ‘‘నిప్పుతో ఆడుకునే వారు దానివల్లే నాశనమవుతారు. ఈ విషయం అమెరికా తెలుసుకోవాలి‘ అంటూ బైడెన్‌ వద్ద జిన్‌పింగ్‌ ప్రస్తావించినట్లు.. చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ క్రమంలో.. ‘అమెరికా–చైనా సంబంధాలను వ్యూహాత్మక పోటీదారు కోణంలో చూడటం, చైనాను ప్రధాన ప్రత్యర్థిగా భావించడం వంటి వాటిని బైడెన్‌తో జిన్‌పింగ్‌ ప్రముఖంగా ప్రస్తావించారు. ఇలాంటి విధానం అంతర్జాతీయ సమాజాన్ని, రెండు దేశాల ప్రజలను తప్పుదోవ పట్టించడమే అవుతుందని, ఇరు దేశాల సంబంధాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని జిన్‌పింగ్‌ అన్నారు’ అని విదేశాంగ శాఖ తెలిపింది. జిన్‌పింగ్‌–బైడెన్‌ చర్చలకు సంబంధించి శ్వేతసౌధం ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇదీ చదవండి: మరో ఆరేళ్లు అమెరికాతో ప్రయాణం- రష్యా ప్రకటన 

మరిన్ని వార్తలు