Biden Phone Call: ఏడు నెలల తర్వాత మాట్లాడుకున్న ఆ రెండు దేశాల అధినేతలు

11 Sep, 2021 19:44 IST|Sakshi

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌  చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు శనివారం ఫోన్‌ చేసి మాట్లాడారు. బైడెన్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిన్‌పింగ్‌కు ఫోన్‌లో మాట్లాడం ఇది రెండోసారి. సాధారణంగా అమెరికా, చైనా మధ్య పలు అంశాల్లో విపరీతంగా పోటీ నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా వీరిద్దరు చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 12న మాట్లాడారు.

ఆ సంభాషణలో.. ఇరువురు నాయకులు విస్తృతమైన, వ్యూహాత్మక అంశాలపై చర్చించుకొన్నారు. వాటితో పాటు ఈ దేశాల మధ్య నెలకొన్న పోటీ వివాదంగా మారకుండా ఉండేలా అమెరికా తీసుకొంటున్న చర్యలను బైడెన్‌ జిన్‌పింగ్‌కు స్పష్టంగా వెల్లడించారని వాషింగ్టన్‌ అధికారులు తెలిపారు. ఈ ఫోన్‌కాల్‌పై చైనా బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్థ సీసీటీవీ స్పందిస్తూ.. ఇరు పక్షాలు వ్యూహాత్మక అంశాలపై లోతుగా చర్చించుకొన్నట్లు పేర్కొంది.

వాషింగ్టన్ అభ్యర్థన మేరకు ఈ సంభాషణ జరిగిందని తెలిపింది. యూఎస్, చైనా విధానం ద్వైపాక్షిక సంబంధాలలో తీవ్రమైన ఇబ్బందులకు దారితీసిందని, రెండు దేశాలలోని ప్రజల ప్రాథమిక ప్రయోజనాలకు, అదే విధంగా అన్ని దేశాల ఉమ్మడి ప్రయోజనాలకు విరుద్ధంగా నడిచే అవకాశం ఉన్నట్లు జి- బైడెన్‌తో వెల్లడించినట్లు తెలిపింది. చైనా-అమెరికాల మధ్య సంబంధాలను సరైన మార్గంలో నడిపిస్తే అది ప్రపంచానికి చాలా ప్రయోజనకరమని షీజిన్‌పింగ్‌ అభిప్రాయడ్డారని వెల్లడించింది.

చదవండి: అక్కడ క్షణాల్లో బైడెన్‌ని ఓడిస్తా: ట్రంప్‌

మరిన్ని వార్తలు