ఐసిస్‌ టాప్‌ లీడర్‌ అబు ఇబ్రహీం అల్‌ ఖురేషీ హతం

4 Feb, 2022 03:58 IST|Sakshi

సిరియాలో యూఎస్‌ దాడులు

అత్మే (సిరియా): అమెరికా ప్రత్యేక దళాలు బుధవారం రాత్రి సిరియాలో జరిపిన మెరుపుదాడిలో ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌ (ఐఎస్‌) చీఫ్‌ అబూ ఇబ్రహీం అల్‌ హషిమీ అల్‌ ఖురేషీ హతమయ్యాడు. రెబెల్స్‌ అధీనంలోని వాయవ్య ఇద్లిబ్‌ ప్రావిన్సులో ఖురేషీ దాగున్న రెండంతస్తుల ఇంటిపై ప్రత్యేక దళాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ఐఎస్‌ సాయుధులకు, వారికి రెండు గంటల పాటు హోరాహోరీ కాల్పులు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం.

చివరికి ఇంటిని సైన్యం చుట్టుముట్టడంతో ఖురేషీ బాంబు పేల్చుకుని కుటుంబంతో సహా చనిపోయినట్టు యూఎస్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఆరుగురు పిల్లలు, నలుగురు మహిళలతో పాటు కనీసం 13 మంది మరణించినట్టు సమాచారం. మృతదేహాలు తునాతునకలయ్యాయని, బాంబు దాడుల్లో ఇల్లు  నేలమట్టమైందని చెబుతున్నారు. విజయవంతంగా ఆపరేషన్‌ పూర్తి చేసి తమ సైనికులంతా క్షేమంగా తిరిగొచ్చినట్టు యూఎస్‌ అధ్యక్షుడు బైడెన్‌ గురువారం ప్రకటించారు.

అచ్చం బగ్దాదీ మాదిరిగానే...
2019 అక్టోబర్లో ఐఎస్‌ చీఫ్‌ అబూ బకర్‌ అల్‌ బగ్దాదీ కూడా ఇదే ఇద్లిబ్‌ ప్రాంతంలో యూ ఎస్‌ దళాలు చుట్టుముట్టడంతో ఇలాగే బాం బు పేల్చు కుని చనిపోయాడు. తర్వాత అక్టోబర్‌ 31న ఖురేషీ ఐఎస్‌ చీఫ్‌ అయ్యాడు. అప్పటినుంచీ వీలైనంత వరకూ జనాల్లోకి రాకుండాలో ప్రొఫైల్‌లో ఉండేవాడు. మళ్లీ కూడదీసుకునే ప్రయత్నం చేస్తున్న ఐఎస్‌కు అతని మరణం పెద్ద దెబ్బేనంటున్నారు.  

పాక్‌లో 13 మంది ఉగ్రవాదులు హతం
కరాచీ: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో రెండు సైనిక శిబిరాలపై సాయుధ ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన జవాన్లు వెంటనే ఎదురు కాల్పులు ప్రారంభించారు. పాంజ్‌గుర్, నోష్కి జిల్లాలో బుధవారం జరిగిన ఈ రెండు ఘటనల్లో కనీసం 13 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, 7గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారని అధికార వర్గాలు గురవారం తెలిపాయి. సైనికులపై కాల్పులు జరిపిం ది తామేనని నిషేధిత బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ(బీఎల్‌ఏ) ప్రకటించింది. నోష్కీలో 9 మంది ఉగ్రవాదులు, 4గురు జవాన్లు, పాంజ్‌గుర్‌లో 4గురు ముష్కరులు, ముగ్గురు సైనికులు మృతి చెందారని పాకిస్తాన్‌ మంత్రి షేక్‌ రషీద్‌ ప్రకటించారు. దాడిని విజయవంతంగా తిప్పికొట్టిన పాక్‌ సైన్యాన్ని ప్రధాని ఇమ్రాన్‌ అభినందించారు.  

మరిన్ని వార్తలు