బైడెన్‌కే పట్టాభిషేకం

8 Nov, 2020 04:28 IST|Sakshi
కమలా హ్యారిస్‌తో బైడెన్‌(ఫైల్‌)

పెన్సిల్వేనియాలో గెలుపుతో ఖాయమైన అధ్యక్ష పీఠం

ఉపాధ్యక్ష పదవికి తొలి మహిళ కమలా హ్యారిస్‌

బైడెన్‌ ఖాతాలోకి 284 ఎలక్టోరల్‌ ఓట్లు

ఎట్టకేలకు తొలగిన ఉత్కంఠ

వాషింగ్టన్‌: అత్యంత ఉత్కంఠ రేకెత్తించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ అభ్యర్థి జోసెఫ్‌ రాబినెట్‌ బైడెన్‌ జూనియర్‌(77)నే చివరికి విజయం వరించింది. ఆయన అమెరికా సంయుక్త రాష్ట్రాల 46వ అధ్యక్షుడిగా శ్వేతసౌధంలో అడుగు పెట్టేందుకు మార్గం సుగమమైంది. ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలిమహిళగా, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ రికార్డుసృష్టించనున్నారు. శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో సొంత రాష్ట్రం పెన్సిల్వేనియా రాష్ట్రంలో జో బైడెన్‌ విజయం సాధించారు.

ఈ గెలుపుతో ఆయనకు మరో 20 ఎలక్టోరల్‌ ఓట్లు దక్కాయి. ఎలక్టోరల్‌ కాలేజీలోని 538ఓట్లకుగాను మ్యాజిక్‌ ఫిగర్‌ 270 కాగా, 284 ఓట్లు బైడెన్‌ ఖాతాలో జమయ్యాయి. జార్జియా(16,) నార్త్‌ కరోలినా(15) అలాస్కా(3) వంటి రాష్ట్రాల్లో కౌంటింగ్‌ జరుగుతోంది. ఈ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ తుది ఫలితాలపై ఎటువంటి ప్రభావం చూపదు. దీంతో బైడెనే తదుపరి అధ్యక్షుడని సీఎన్‌ఎన్, వాషింగ్టన్‌ పోస్ట్‌ తదితర ప్రముఖ వార్తా సంస్థలు ప్రకటించాయి. ‘జోసెఫ్‌ ఆర్‌.బైడెన్‌ జూనియర్‌ అమెరికా 46వ అధ్యక్షుడిగా శనివారం ఎన్నికయ్యారు. దేశంలో సాధారణ రాజకీయ పరిస్థితులను నెలకొల్పుతాననీ, ఆరోగ్యం, ఆరి్థక సంక్షోభాలను ఎదుర్కొంటున్న సమయంలో జాతీయ ఐక్యతను సాధిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ట్రంప్‌ హయాంలో వైట్‌ హౌస్‌లో నాలుగేళ్ల పాటు సాగిన గందరగోళానికి ఆయన ముగింపు పలికారు’ అని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు తెలిసిన వెంటనే బైడెన్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ‘అమెరికా, ఈ గొప్ప దేశానికి నాయకత్వం వహించడానికి నన్ను ఎన్నుకోవడం గౌరవంగా భావిస్తున్నా.  మీరు నాకు ఓటేసినా వేయకున్నా అందరు అమెరికన్లకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తా. నా లక్ష్యం చాలా కష్టమైంది. అయినప్పటికీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా’ అని పేర్కొన్నారు. ‘ఈ ఎన్నికలు జో బైడెన్‌ కంటే నా కంటే కూడా దేశానికే ఎక్కువ అవసరం. ఇవి అమెరికా ఆత్మ గౌరవానికి సంబంధించినవి. అందుకోసం మనం పోరాడుదాం. లక్ష్యం సాధించేందుకు అందరం కలిసి పనిచేయడం ప్రారంభిద్దాం’ అని కమలా హ్యారిస్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

గోల్ఫ్‌ క్లబ్‌కు ట్రంప్‌
ఇప్పటి వరకు ఎన్నికల్లో అక్రమాలంటూ పలు ఆరోపణలు చేస్తున్న ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కథ ముగిసిట్లేనని భావిస్తున్నారు. శనివారం ట్రంప్‌..వర్జీనియా రాష్ట్రం స్టెర్లింగ్‌లో ఉన్న తన సొంత ట్రంప్‌ నేషనల్‌ గోల్ఫ్‌ క్లబ్‌కు వెళ్లిపోయారు. ఈ ఓటమితో అమెరికా చరిత్రలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రెండో విడత ఎన్నిక కాలేని మూడో అధ్యక్షుడిగా ఆయన చరిత్రకెక్కారు. గడిచిన 25 ఏళ్లలో 1992లో జార్జి హెచ్‌. బుష్‌ తర్వాత ఇలా పరాజయం మూటగట్టుకున్న ఏకైక అధ్యక్షుడు కూడా ట్రంప్‌నే.

బోసిపోయిన వైట్‌హౌస్‌
ఎన్నికల ఫలితాల ప్రభావం అధ్యక్షభవనంపై పడింది. సాధారణంగా అక్కడ కనిపించే హడావుడి ఒక్కసారిగా మాయమైంది. శ్వేతసౌధం లాన్లలో మాత్రమే కొద్దిపాటి మీడియా సిబ్బంది కనిపించారు. బైడెన్‌ మద్దతు దారులు రాజధాని వాషింగ్టన్‌తోపాటు, న్యూయార్క్, షికాగో, అట్లాంటా తదితర ప్రాంతాల్లో వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాం«దీ, కెనడా ప్రధానమంత్రి ట్రూడో తదితరులు బైడెన్, కమలాహ్యారిస్‌లను అభినందించారు.

ఎన్నికల్లో అక్రమాలంటూ మరోసారి ట్రంప్‌
ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ శనివారం మరోసారి ట్రంప్‌ ఆరోపణలు చేశారు. ‘పెన్సిల్వేనియా లాంటి చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి మా పరిశీలకులను రానివ్వలేదు. లోపల ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు వీల్లేకుండా చేశారు. జరక్కూడనివి జరిగిపోయాయి. చట్టబద్ధమైన పారదర్శకత కనిపించలేదు. రాత్రికి రాత్రే ఫలితాలు మారిపోయాయి. అక్కడ ఏం జరిగిందో తెలియదు’అని పేర్కొన్నారు. వాస్తవానికి భారీ మెజారిటీతో మేమే ఈ ఎన్నికల్లో గెలిచాం అంటూ ప్రకటించుకున్నారు. ‘అధ్యక్ష పదవి తనదే నంటూ జోబైడెన్‌ చెప్పుకోవడం తప్పు. అలా నేను కూడా చెప్పుకోగలను. ఎన్నికల ఫలితాలపై కోర్టుల్లో వేసిన పిటిషన్లపై ఇప్పుడిప్పుడే ప్రొసీడింగ్‌ మొదలయ్యాయని పేర్కొన్నారు. ఎన్నికల రోజున రాత్రి 8 గంటల తర్వాత కూడా అక్రమంగా వేల సంఖ్యలో ఓట్లను స్వీకరించారన్నారు. ట్రంప్‌ ట్వీట్లను ట్విట్టర్‌ సంస్థ ఫ్లాగ్‌ చేసి చూపింది.

వాషింగ్టన్‌లో వైట్‌హౌస్‌ వద్ద సంబరాలు

మరిన్ని వార్తలు