ఇది నిరసన కాదు: జో బైడెన్‌

7 Jan, 2021 09:21 IST|Sakshi

వాషింగ్టన్‌: క్యాపిటల్‌ బిల్డింగ్‌(పార్లమెంటు)పై దాడిని అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్రంగా ఖండించారు. ‘‘ఇది నిరసన కాదు.. రాజకీయ తిరుగుబాటు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజస్వామ్యంపై జరిగిన దాడిగా ఈ ఘటనను అభివర్ణించారు. అదే విధంగా ప్రస్తుత ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ వెంటనే జాతిని ఉద్దేశించి ప్రసంగించాలని, క్యాపిటల్‌ భవనాన్ని ముట్టడించిన తన మద్దతుదారులను వెనక్కి పిలవాలని డిమాండ్‌ చేశారు. హింసకు స్వస్తి పలకాలని విజ్ఞప్తి చేశారు. అధ్యక్షుడిగా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ‘‘క్యాపిటల్‌ బిల్డింగ్‌లోకి దూసుకురావడం, కిటికీలు పగులగొట్టి అమెరికా సెనేట్‌ను ఆక్రమించడం... చట్టబద్ధంగా ఎన్నికైన అధికారులను బెదిరింపులకు గురిచేయడం? దీనిని నిరసన అనరు.. ఇది కచ్చితంగా తిరుగుబాటు’’ అని బైడెన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ విద్రోహ చర్యలను ఇప్పటికైనా ఆపివేయాలని విజ్ఞప్తి చేశారు. (చదవండి: ట్రంప్‌ మద్దతుదారుల వీరంగం.. కాల్పులు)

నిజమైన అమెరికా అంటే
‘‘మనం నేడు చూస్తున్న దాని కంటే అమెరికా మరెంతో మెరుగ్గా ఉంటుంది. ప్రజాస్వామ్యం.. చట్టాలను గౌరవించడం, పరస్పర గౌరవంతో ముందుకు సాగడమై మన దేశ విధానం. కానీ రోజు ప్రపంచమంతా మనవైపు చూస్తోంది. నేటి ఘటనతో నేను షాక్‌కు గురయ్యాను. ఇదొక చీకటి రోజు. కానీ మనం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి. రానున్న నాలుగేళ్లలో ప్రజాస్వామ్యబద్ధంగా, నిజాయితీగా, చట్టాలను గౌరవిస్తూ ముందుకు సాగాలి.  విద్వేషాలు, స్వార్థపూరిత రాజకీయాలు విడనాడాలి. సహనంతో ఉండాలి. నిజమైన అమెరికా అంటే ఏమిటో చూపించాలి’’ అని బైడెన్‌ ట్విటర్‌ వేదికగా వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ డొనాల్డ్‌ ట్రంప్‌ ఓటమిని అంగీకరించని ఆయన మద్దతుదారులు పార్లమెంటును ముట్టడించి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.‌ 

మరిన్ని వార్తలు