Al-Qaeda Chief al-Zawahiri: అల్‌ఖైదా చీఫ్ అల్‌ జవహరి హతం... వెల్లడించిన జో బైడెన్‌

2 Aug, 2022 07:12 IST|Sakshi

కాబూల్‌: అల్‌ఖైదా చీఫ్ అల్-జవహరిని అమెరికా మట్టుబెట్టింది. అఫ్గానిస్తాన్ రాజధాని  కాబూల్‌లో డ్రోన్ దాడులు జరిపి అతడ్ని హతమార్చింది. అల్‌ జవహరి మృతిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి అల్ జవహరిని మట్టుబెట్టినట్లు పేర్కొన్నారు. 

అల్ జవహరి కుటుంబంతో సహా కాబూల్‌లోని ఓ ఇంట్లో తలదాచుకున్నట్లు అమెరికా నిఘా వర్గాలు పసిగట్టాయి. దీంతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించేందుకు జో బైడెన్ అమెరికా సైన్యానికి గతవారం అనుమతిచ్చారు. ఆదివారం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన వారు డ్రోన్ దాడులు చేసి అల్‌ జవహరిని హతమార్చారు. ఈ ఘటనలో సాధారణ పౌరులెవరూ ప్రాణాలు కోల్పోలేదని బైడెన్ పేర్కొన్నారు. అల్‌ జవహరి మృతితో 9/11 ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేసినట్లయిందని అన్నారు.

2001లో అమెరికా ట్విన్ టవర్లపై ఉగ్రదాడి ఘటనలో ఒసామా బిన్ లాడెన్‌తో పాటు అల్ జవహరి కూడా ముఖ్య సూత్రధారి. పాకిస్తాన్‌లో తలదాచుకున్న బిన్ లాడెన్‌ను 2011 మే 2న ప్రత్యేక ఆపరేషన్ నిర్వహంచి మట్టు బెట్టింది అమెరికా సైన్యం. ఇప్పుడు కాబూల్‌లో నక్కి ఉన్న అల్ జవవరిని హతమార్చింది.

అఫ్గానిస్తాన్‌ నుంచి అమెరికా బలగాలు వెళ్లిపోయిన 11 నెలలకే అల్‌ఖైదా చీఫ్‌ను అంతం చేయడం ఉగ్రవాదంపై పోరులో అమెరికాకు కీలక విజయమనే చెప్పవచ్చు. అల్ జవహరి మృతితో ఇకపై అప్గానిస్థాన్ ఉగ్రవాదులకు సురక్షితమైన ప్రదేశంగా ఉండబోదని బైడెన్ పేర్కొన్నారు.


చదవండి: షాకింగ్! బిన్ లాడెన్ కుటుంబం నుంచి భారీ విరాళం తీసుకున్న బ్రిటన్ ప్రిన్స్‌!

మరిన్ని వార్తలు