పాకిస్తాన్‌పై బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు... ఆ దేశాలతో ముప్పు

15 Oct, 2022 13:28 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అణ్వాయుధాల సమన్వయం లేని పాకిస్తాన్‌ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో ఒకటిగా అభివర్ణించారు. ఈ మేరకు బైడెన్‌ లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన డెమోక్రటిక్‌ కాంగ్రెస్‌ క్యాంపెయిన్‌ కమిటీ రిసెప్షన్‌ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా రష్యా తీరుపై కూడా విమర్శలు కురింపించారు. బైడెన్‌ చైనా, రష్యాలతో గల యూసెస్‌ విదేశాంగ పాలసీ విధానం గురించి చెబుతూ పాకిస్తాన్‌పై ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతేగాదు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కి తనకు కావల్సిన దానిపై పూర్తి క్లారిటీ ఉందని, కానీ పలు వివాదాలను ఎదుర్కొంటున్నాడని అన్నారు. ఈ 21వ శతాబ్దంలో రెండో త్రైమాసికంలో అమెరికాను మరింత శక్తివంతంగా మార్చేందుకు పలు అపారమైన అవకాశాలు ఉన్నాయని నమ్మకంగా చెప్పారు. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా వ్యూహాం విదేశాంగ పాలసీ సంబంధించిన కీలక పత్రాలను విడుదల చేసింది. ఐతే అమెరికా విడుదల చేసిన 48 పేజీల ఈ డాక్యుమెంట్‌లలో పాకిస్తాన్‌కి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు.

ఆ డాక్యుమెంట్‌లో... హద్దులేని భాగస్వామ్యంతో చైనా, రష్యాలు కలిసిపోతున్నాయని హెచ్చరించారు. ఆ రెండు దేశాలు విసిరే సవాళ్లు చాలా విభిన్నంగా ఉన్నాయన్నారు. ఈ రెండు దేశాలతో యూఎస్‌కి ఎదురయ్యే ముప్పు గురించి నొక్కి చెప్పారు. రష్యా ఆగడాలకు అడ్డుకట్టవేస్తూ పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనాపై శాశ్వతమైన పోటీని కొనసాగించేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ముఖ్యంగా ఇండో పసిఫిక్‌ ప్రాంతాల్లో చైనాతో పోటీ ఎక్కువగా ఉంటుందని, ప్రపంచవ్యాప్తంగా కూడా పెరిగే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.  

(చదవండి: 'నాటో యుద్ధానికి దిగితే ప్రపంచ విపత్తు తప్పదు': పుతిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌)

మరిన్ని వార్తలు