జార్జియా రీకౌంటింగ్‌లో బైడెన్‌ గెలుపు

21 Nov, 2020 04:49 IST|Sakshi

వాషింగ్టన్‌: రిపబ్లికన్లకు గట్టి పట్టున్న జార్జియా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల రీకౌంటింగ్‌లో డెమొక్రాటిక్‌ జోబైడెనే గెలుపు సాధించారు. దీంతో 1992 తర్వాత ఈ రాష్ట్రంలో గెలిచిన డెమొక్రాట్‌ అభ్యర్థిగా బైడెన్‌ నిలిచారు. ఇటీవల జరిగిన కౌంటింగ్‌లో ట్రంప్‌ కన్నా బైడెన్‌కు 14వేల ఓట్ల మెజార్టీ లభించింది. ఇరువురి మధ్య మెజార్టీ స్వల్పం కావడంతో ఇక్కడ బ్యాలెట్లను మాన్యువల్‌గా రీకౌంటింగ్‌ చేశారు. రీకౌంటింగ్‌లో బైడెన్‌కు 12,284 ఓట్ల మెజార్టీ లభించింది. రీకౌంటింగ్‌ కచ్చితత్వంతో జరిపామని జార్జియా స్టేట్‌ సెక్రటరీ బ్రాడ్‌రాఫెన్‌స్పెర్గర్‌ చెప్పారు.

గత ఫలితాల్లో ఎలాంటి భారీ అవకతవకలు జరగలేదని ఆడిట్‌లో తేలినట్లు అధికారులు వెల్లడించారు. తమ ఎన్నికల అధికారుల కృషి కారణంగానే స్వల్పకాలంలో రీకౌంటింగ్‌ పూర్తయిందన్నారు. శుక్రవారం ఈ రీకౌంటింగ్‌ ఫలితాలన్నీ సర్టిఫై చేయవచ్చని అంచనా. ఈ గెలుపుతో బైడెన్‌కు జార్జియాలోని 16 ఎలక్ట్రోరల్‌ ఓట్లు లభిస్తాయి. దీంతో ఆయనకు వచ్చిన ఓట్లు 306కు చేరతాయి. 2016లో ట్రంప్‌ ఈ రాష్ట్రాన్ని హిల్లరీతో పోటీపడి గెలుచుకున్నారు. తాజా రీకౌంటింగ్‌పై ట్రంప్‌ లీగల్‌ అధికారులు స్పందిస్తూ ఇంకా సర్టిఫై కాకముందే మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందన్నారు.  న్యాయం జరిగేందుకున్న అన్ని లీగల్‌ మార్గాలను పరిశీలిస్తామన్నారు.  

మళ్లీ డబ్ల్యూహెచ్‌వోలో చేరతాం: బైడెన్‌
తమ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక తిరిగి ప్రపంచ ఆరోగ్య సమాఖ్య(డబ్ల్యూహెచ్‌వో)లో చేరతామని అమెరికా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ జోబైడెన్‌ స్పష్టం చేశారు. అయితే, డబ్ల్యూహెచ్‌వోలో సంస్కరణలు అవసరమన్నారు. చైనాతో సంబంధాలపై మాట్లాడుతూ ‘శిక్షించడంపై కన్నా నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని చైనాకు అవగాహన కల్పించడం ముఖ్యం’ అని చెప్పారు.  ఇతర దేశాలతో కలిసి చైనాకు అవగాహన కలిగించేందుకు యత్నిస్తామని చెప్పారు. పారిస్‌ పర్యావరణ ఒప్పందంలో కూడా మరలా చేరతామన్నారు. అమెరికా–చైనా సంబంధాలు ట్రంప్‌ హయాంలో బాగా దెబ్బతిన్నాయి.  

మరిన్ని వార్తలు