భారతీయ మహిళలకే అధిక ప్రయోజనం!

29 Jan, 2021 04:20 IST|Sakshi

అమెరికాలో హెచ్‌–1బీ వీసాదారుల భాగస్వాములకు ఉద్యోగ అనుమతి

వాషింగ్టన్‌: అమెరికాలో హెచ్‌4 వీసాలు ఉన్నవారికి పని అనుమతిని రద్దు చేస్తూ డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో తీసుకున్న నిర్ణయాన్ని కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌ ఉపసంహరించారు. ఈ నిర్ణయంలో భారతీయ మహిళలే అధికంగా ప్రయోజనం పొందుతారన్న అంచనాలు వెలువడుతున్నాయి. హెచ్‌–1బీ వీసా కలిగి ఉన్నవారి జీవిత భాగస్వాములకు(భార్య లేదా భర్త), వారి పిల్లలకు (21 ఏళ్లలోపు వయసు) హెచ్‌4 వీసాలను యూఎస్‌ సిటిజెన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) జారీ చేస్తోంది. అమెరికాలో హెచ్‌–1బీ వీసా కింద పనిచేస్తున్నవారిలో అత్యధిక శాతం మంది భారతీయ ఐటీ నిపుణులే. ఈ వీసాలతో అమెరికా కంపెనీలు విదేశీ సాంకేతిక నిపుణులను స్వదేశంలోనే నియమించుకోవచ్చు.

ఇండియా, చైనా నుంచి ప్రతిఏటా వేలాది మంది హెచ్‌–1బీ వీసాలతో అమెరికాలో ఉద్యోగాలు పొందుతున్నారు. బరాక్‌ ఒబామా ప్రభుత్వ హయాంలో హెచ్‌–1బీ వీసాలున్నవారి జీవిత భాగస్వాములు అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్యోగ అనుమతి కార్డులు దక్కించుకున్నారు. వీరిలో ఎక్కువ మంది భారతీయ మహిళలే కావడం విశేషం. డొనాల్డ్‌ ట్రంప్‌ పగ్గాలు చేపట్టాక వలసలపై కఠినంగా వ్యవహరించారు. హెచ్‌4 వీసాదారులకు ఉద్యోగ అనుమతిని రద్దు చేస్తున్నట్లు 2017లో ప్రకటించారు.  ట్రంప్‌ నిర్ణయాలను తిరగదోడుతామని ఎన్నికల ప్రచారంలో జో బైడెన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే.. గడువు ముగిసిన హెచ్‌4 వీసాదారుల ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌(ఈఏడీ) చెల్లుబాటును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని వార్తలు