చైనాకు చెక్‌పెట్టేందుకు సిద్ధమైన బైడెన్‌ ప్రభుత్వం

21 Jul, 2021 03:40 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచంలోని మిత్రదేశాలతో కలిసి చైనాకు చెక్‌పెట్టాలని బైడెన్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల చైనా సైబర్‌దాడులపై పలు దేశాలతో కలిసి అమెరికా ఆరోపణలు చేసింది. ఈయూ, నాటో సహా పలు దేశాలు సోమ వారం చైనాపై సైబర్‌దాడుల అంశంలో అమెరికా తో కలిసి ఆరోపణలతో విరుచుకుపడ్డాయి. చైనాను అడ్డుకునేందుకు అందరితో కలిసి పనిచేయడమే తమ వ్యూహమని వైట్‌హౌస్‌ వర్గాలు వెల్లడించాయి.

ఇందులో భాగంగానే తొలిసారి నాటో చైనాకు వ్యతిరేకంగా సైబర్‌దాడులపై ఆరోపణ చేసిందని, పలు దేశాలు సైతం ఈ విషయంలో ముందుకువచ్చి చైనాను విమర్శించాయని తెలిపాయి. ఇలాంటి అనైతిక సైబర్‌ దాడులు కేవలం అమెరికానే కాకుండా పలు దేశాలను ఇబ్బంది పెడుతున్నా యని వైట్‌హౌస్‌ ప్రెస్‌సెక్రటరీ జెన్‌సాకి చెప్పారు. అందువల్ల వీటి నివారణకు మిత్రులతో కలిసి చర్యలు చేపడతామని చెప్పారు. సైబర్‌ దాడుల అంశంలో రష్యా, చైనాలకు బేధం ఉందన్నారు. అవసరమైనప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు.

గ్రూపులు కడితే బెదిరేది లేదు!: చైనా
బీజింగ్‌: తమపై నిరాధార ఆరోపణలు మోపేందుకు పలు దేశాలతో అమెరికా గ్రూపులు కడుతోందని, తమపై ఇలా బురద జల్లడం మానుకోవాలని చైనా హెచ్చరించింది. అంతర్జాతీయ సైబర్‌ కుట్ర చేసారంటూ తనపై అమెరికా, నాటో కూటమి చేసిన ఆరోపణలను చైనా తోసిపుచ్చింది. యూఎస్‌ ప్రోత్సాహంతోనే నాటో సైబర్‌ స్పేస్‌ను యుద్ధభూమిగా మార్చిందని, దీనివల్ల సైబర్‌ ఆయుధాల పోటీ పెరిగిందని చైనా విదేశాంగ ప్రతినిధి జావో లిజియన్‌ విమర్శించారు. పలు దేశాల్లో జరిగిన సైబర్‌ దాడులపై యూకే, ఆస్ట్రేలియా, కెనడా, నాటో దేశాలు, జపాన్, న్యూజిలాండ్‌తో కలిసి యూఎస్‌ సోమవారం చైనాపై తీవ్ర ఆరోపణలు చేసింది.

క్రిమినల్‌ హ్యాకర్లతో చైనాకు అధికారిక సంబంధాలున్నాయని విమర్శించింది. ఇవన్నీ నిరాధారాలని లిజియన్‌ తోసిపుచ్చారు. సైబర్‌ దాడులను తాము ప్రోత్సహించమన్నారు. సైబర్‌ దాడులకు నాటోనే కారణమని దుయ్యబట్టారు. ఆరోపణలపై యూఎస్‌ చూపుతున్న ఆధారాలు సంపూర్ణంగా లేవన్నారు. నిజానికి ప్రపంచంలో అమెరికానే అతిపెద్ద సైబర్‌దాడుల కర్తని ఆరోపించారు. తమ దేశంపై జరుపుతున్న ఇలాంటి హ్యాకింగ్‌ దాడులను ఆపాలని అమెరికా, దాని మిత్రదేశాలను చైనా హెచ్చరించింది. ఇలాంటి దాడులు అడ్డుకునేందుకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపింది. 

మరిన్ని వార్తలు