ఇదేం పద్ధతి.. రిపోర్టర్‌ ప్రశ్నలు అడిగారని డోర్‌ వేసి వెళ్లిపోయిన బైడెన్‌!

14 Mar, 2023 13:59 IST|Sakshi

వాషింగ్టన్‌: ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేరు ఏదో ఒక రూపంలో వార్తల్లో వినిపిస్తూనే ఉంది. తాజాగా ఆయన ప్రవర్తించిన తీరుతో మరో సారి వార్తల్లోకెక్కారు. ఓ వైపు రిపోర్టర్లు ప్రశ్నలు సంధిస్తుంటే..అవేమీ తనకు కాదన్నట్టు గది నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. అగ్రరాజ్యంలో రెండు బ్యాంకుల్లో సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. వీటి గురించి బైడెన్‌ మాట్లాడుతూ.. తమ బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితంగానే ఉందని భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇంతలో విలేకరులు పలు ప్రశ్నలు సంధించారు. ‘అసలు ఈ  సంక్షోభం ఎందుకు తలెత్తిందనే దానిపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి..? దీని తర్వాత ఇలాంటి పరిణామాలు ఉండవని మీరు అమెరికన్లకు భరోసా ఇవ్వగలరా..? అని ఒకరు తర్వాత ఒకరు ప్రశ్నలు అడుగుతున్నారు. అయతే వాటికి సమాధానం ఇ‍వ్వకుండా ఆ గది నుంచి బైడెన్‌ మౌనంగా వెళ్లిపోయారు. అంతలో మరో రిపోర్టర్‌ "మిస్టర్ ప్రెసిడెంట్, ఇతర బ్యాంకులు కూడా ఇలా విఫలమైతే పరిస్థితి ఏంటి," అన్ని ప్రశ్నిస్తున్నా అవేవి పట్టించుకోకుండా గది తలుపు వేసి బయటకు వెళ్లారు.

 వైట్ హౌస్ యూట్యూబ్ ఛానెల్‌లో  బైడెన్ బయటకు వెళ్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.  అమెరికా ప్రెసిడెంట్ విలేకరుల ప్రశ్నలకు బదులివ్వక మధ్యలో వదిలి వెళ్లడం ఇదేం మొదటిసారి కాదు. చైనా "స్పై బెలూన్" ఘటన తర్వాత జర్నలిస్టులు బైడెన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. అంతలో ఆయన "నాకు విరామం ఇవ్వండని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గత సంవత్సరం, కూడా కొలంబియా అధ్యక్షుడిని కలిసిన తర్వాత విలేకరులు అతనిపై ప్రశ్నలు సంధిస్తున్నప్పుడు సమాధానం చెప్పకుండా  బైడెన్‌ నవ్వుతున్న క్లిప్ వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో చాలా మంది "బైడెన్‌ జర్నలిస్టులతో ఎక్కువగా మాట్లాడడు.. ఎందుకంటే ఆయన వద్ద సమాధానాలు లేవని వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వార్తలు