జెలెన్‌స్కీ తీరుపై జో బైడెన్‌ అసహనం.. అత్యాశకు పోతే అంతే!

1 Nov, 2022 19:39 IST|Sakshi

వాషింగ్టన్‌: రష్యా దాడిని తప్పుపడుతూ ఎప్పటికప్పుడూ ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌. ఉక్రెయిన్‌కు అడగక ముందే ఆర్థికంగా, ఆయుధాల సాయం అందించారు. అలాంటిది ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీరుపై జో బైడెన్‌ అసహనం వ్యక్తం చేశారంటే నమ్ముతారా? అది నిజమే.. జో బైడెన్‌ అసహనం వ్యక్తం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది జూన్‌లో ఇరువురి మధ్య ఫోన్‌ సంభాషణ నడుస్తుండగా ఆయుధాల విషయంపై బైడెన్‌ అసహనం వ్యక్తం చేసినట్లు ఎన్‌బీసీ న్యూస్‌ సోమవారం వెల్లడించింది.

జూన్‌ 15వ తేదీన 1 బిలియన్‌ డాలర్ల మానవీయ, సైనిక సాయంపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడికి బైడెన్‌ ఫోన్‌ చేశారు. ఈ క్రమంలో బైడెన్‌ వివరాలు చెప్పటం ముగించాక.. ఉక్రెయిన్‌కు ఇంకా కావాల్సిన ఆయుధాల జాబితాను జెలెన్‌స్కీ చెప్పటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అసహనానికి గురైన బైడెన్‌ స్వరం పెంచి.. ‘కొంచెం కృతజ్ఞత చూపించండి’ అని వ్యాఖ్యానించారు. అయితే, అలాంటిదేమి లేదని బుకాయించేప్రయత్నం చేశారు జెలెన్‌స్కీ. సాయం చేసినందుకు బైడెన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియో సందేశాన్ని పంపారు. 

కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌ రిపోర్టు ప్రకారం.. 2022లో అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాలు ఉక్రెయిన్‌కు  వచ్చాయి. అమెరికా ఇచ్చిన ఆయుధాల్లో హైమొబిలిటీ ఆర్టిలరీ రాకెట్‌ సిస్టమ్స్‌, స్టింగర్‌ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్స్‌, జావెలిన్‌ క్షిపణులు, ఎం-17 హెలికాప్టర్లు ఉన్నట్లు పెంటగాన్‌ నివేదికలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి: ఉక్రెయిన్‌ ఎఫెక్ట్‌: వికీపీడియాకు భారీ జరిమానా

మరిన్ని వార్తలు