బైడెన్‌ అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన

20 Aug, 2020 03:00 IST|Sakshi

జీవితంలో దక్కిన గొప్ప గౌరవమని బైడెన్‌ ట్వీట్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా జో బైడెన్‌ను అధికారికంగా ప్రకటించారు. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌లో జరుగుతున్న డెమొక్రటిక్‌ జాతీయ సదస్సులో పార్టీ ప్రతినిధులందరూ ఏకగ్రీవంగా అధ్యక్ష అభ్యర్థిగా 77 ఏళ్ల వయసున్న జో బైడెన్‌ను నామినేట్‌ చేశారు. కరోనా సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే సాహసం కలిగిన నాయకుడు బైడెన్‌ అని నేతలందరూ కొనియాడారు.

నామినేట్‌ అయ్యాక జో బైడెన్‌తన జీవితంలో దక్కిన అతి గొప్ప గౌరవం ఇదేనని ట్వీట్‌ చేశారు. అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్‌ను అధికారికంగా ప్రకటించి అమెరికా ప్రజల గుండె చప్పుడు ఏంటో పార్టీ చెప్పిందని బైడెన్‌ సతీమణి జిల్‌ బైడెన్‌ భావోద్వేగానికి లోనయ్యారు. అధ్యక్ష ఎన్నికల సర్వేల్లో ట్రంప్‌ కంటే బైడెన్‌ 7.7 పాయింట్లు అధికంగా సంపాదించి ముందంజలో ఉన్నారు.

టీవీ చూడడమే ట్రంప్‌ చేసే పని :క్లింటన్‌
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశానికి అధ్యక్షుడిగా ఉంటూ టీవీ చూస్తూ కాలం గడపడం, సోషల్‌ మీడియాలో ప్రజల్ని గందరగోళానికి గురి చేయడమే ఆయన చేస్తున్న పని అని ఆరోపించారు. అధ్యక్ష కార్యాలయాన్ని కమాండ్‌ సెంటర్‌ బదులుగా ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారని విమర్శించారు. అమెరికాకి పూర్వ వైభవం తీసుకువచ్చే సత్తా బైడెన్‌కే ఉందని క్లింటన్‌ వ్యాఖ్యానించారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు