భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్‌ గార్సెటీ !

11 Jul, 2021 02:59 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలోని లాస్‌ ఏంజలస్‌ మేయర్‌గా పని చేస్తున్న ఎరిక్‌ గార్సెటీని భారత్‌లో అమెరికా రాయబారిగా నియమించేందుకు అధ్యక్షుడు బైడెన్‌ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని బైడెన్‌ గురువారం ఖరారు చేసినట్లు ఎరిక్‌ వెల్లడించారు. సెనేట్‌ ఆయన నియామకాన్ని ధ్రువీకరిస్తే భారత్‌లో అమెరికా రాయబారిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం భారత్‌లో అమెరికా రాయబారిగా ట్రంప్‌ ప్రభుత్వం నియమించిన కెనెత్‌ జస్టర్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 50 ఏళ్ల ఎరిక్‌ డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన వారు.

దాదాపు 12 ఏళ్ల పాటు లాస్‌ ఏంజలస్‌ సిటీ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్నారు. అందులో ఆరేళ్ల పాటు కౌన్సిల్‌ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. 2013 నుంచి లాస్‌ ఏంజలస్‌ నగర మేయర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. భారత్‌ గురించి స్పందిస్తూ.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు తన నియామకం జరగడం సంతోషంగా ఉందని చెప్పారు. గతంలో ఆయన భారత్‌లో ఏడాది పాటు ఉండి హిందీ, ఉర్దూ భాషలపై అధ్యయనం కూడా చేశారు. 

మరిన్ని వార్తలు