కరోనా మూలాలను తేల్చండి: బైడెన్‌

28 May, 2021 03:22 IST|Sakshi

వాషింగ్టన్‌: కరోనా పుట్టుకను కనుగొనే ప్రయత్నాలను వేగవంతం చేసి, 90 రోజుల్లోగా పూర్తి నివేదిక అందించాలని అమెరికా అధ్యక్షుడు  బైడెన్‌ దేశంలోని నిఘా విభాగాలను ఆదేశించారు. వూహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో పనిచేసే పలువురు పరిశోధకులు 2019 నవంబర్‌లో అనారోగ్యం పాలై, ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు అమెరికా ప్రభుత్వ నిఘా నివేదిక వెల్లడించిన నేపథ్యంలో బైడెన్‌ ఈ ఆదేశాలిచ్చారు. ‘నిఘా వర్గాల ప్రయత్నాలను వేగవంతం చేసేందుకు జాతీయ పరిశోధన శాలలు, ఇతర ప్రభుత్వ విభాగాలు కూడా తోడుగా నిలవాలని కోరాను. చైనా నుంచి సమాధానం రావాల్సిన కొన్ని నిర్దిష్ట ప్రశ్నలతోపాటు తదుపరి విచారణ చేపట్టాల్సిన అంశాలను కూడా ఆ నివేదికలో పొందుపరచాలని సూచించాను’అని బైడెన్‌ ఒక ప్రకటన చేశారు. పారదర్శకంగా, సాక్ష్యాల ఆధారంగా సాగే అంతర్జాతీయ విచారణకు సహకరించి, అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని, ఆధారాలను అందించేలా చైనాపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు భావసారూప్యం గల దేశాలతో కలిసి పనిచేస్తామన్నారు.

అబద్ధాల ప్రచారమే లక్ష్యం: చైనా
అమెరికా చేస్తున్న ఆరోపణలను చైనా ఖండించింది. ‘నిజాలను, వాస్తవాలను అమెరికా అంగీకరించదు. మూలాలపై శాస్త్రీయత ఆధారిత అధ్యయనంపై ఆ దేశానికి నమ్మకమే లేదు’అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్‌ పేర్కొన్నారు. తమకు కళంకాన్ని ఆపాదించేందుకు, నిందలు వేసేందుకు ఈ మహమ్మారిని అమెరికా ఒక అవకాశంగా తీసుకుంటోందని ఆరోపించారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు