అదే ఉద్రిక్తత.. నెతన్యాహుకు బైడెన్‌ ఫోన్‌

19 May, 2021 02:35 IST|Sakshi

ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య దాడులు, ప్రతిదాడులు  

నిలిచిపోయిన శాంతి చర్చలు 

గాజా సిటీ/వాషింగ్టన్‌: ఇజ్రాయెల్‌ వైమానిక దాడులకు హమాస్‌ మిలటరీ కూడా దీటుగా బదులిస్తోంది. మంగళవారం గాజా నుంచి హమాస్‌ ప్రయోగించిన రాకెట్లు దక్షిణ ఇజ్రాయెల్‌ను బెంబేలెత్తించాయి. ఓ ప్యాకేజింగ్‌ పరిశ్రమ ధ్వంసమయ్యింది. అందులో పనిచేసే ఇద్దరు థాయ్‌లాండ్‌ కార్మికులు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. మరో ఏడుగురు గాయపడ్డారని తెలిపారు. అంతకుముందు ఇజ్రాయెల్‌ సైన్యం గాజాపై బాంబుల వర్షం కురిపించింది. వైమానిక దాడులు కొనసాగించింది. ఈ ఘటనలో గాజాలోని ఆరు అంతస్తుల భవనం నేటమట్టమయ్యింది. ఇందులో విద్యా సంస్థలు, పుస్తక విక్రయ దుకాణాలు ఉన్నాయి. ఇజ్రాయెల్‌ ముందస్తుగా హెచ్చరించడంతో వేకువజామునే ఈ భవనంలో ఉంటున్న వారంతా బయటికి పరుగులు తీశారు. ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య ఇప్పటికిప్పుడు శాంతి ఒప్పందం కుదిరే అవకాశం కనిపించడం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు శాంతి యత్నాలు నిలిచిపోయాయి. అంతర్జాతీయ మధ్యవర్తులు చెతులేత్తేసినట్లు తెలుస్తోంది. 


సమ్మెకు దిగిన పాలస్తీనియన్లు 
తాజా దాడుల వల్ల గాజాలో విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అత్యవసర ఔషధాలు, ఇంధనం, నీటి కొరత వేధిస్తోంది. దీంతో జనం అల్లాడిపోతున్నారు. ఇజ్రాయెల్, తూర్పు జెరూసలేం, ఆక్రమిత వెస్టుబ్యాంకులో ఉన్న పాలస్తీనియన్లు మంగళవారం ఆకస్మాత్తుగా సమ్మెకు దిగారు. నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఇజ్రాయెల్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రమల్లాలో ఇజ్రాయెల్‌ సైనికులపై రాళ్లు విసిరారు. రోడ్లపై టైర్లు దహనం చేశారు. నిరసనకారులు చెదరగొట్టడానికి సైనికులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఈ సందర్భంగా పాలస్తీనా పౌరుడొకరు మరణించారు. 46 మంది గాయపడ్డారు. 

నెతన్యాహుకు బైడెన్‌ ఫోన్‌  
ఇజ్రాయెల్‌కు తనను తాను రక్షించుకొనే హక్కు ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు. ఆయన ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారు. ఇజ్రాయెల్‌ ఆత్మరక్షణ హక్కుకు తాము మద్దతునిస్తామని పేర్కొన్నారు. సాధారణ పౌరుల రక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. మతపరమైన ఘర్షణలను నివారించేందుకు, జెరూసలేంలో శాంతి కోసం సాగుతున్న ప్రయత్నాలను బైడెన్‌ స్వాగతించారు.   

మరిన్ని వార్తలు