యువ సెనేటర్‌ నుంచి వృద్ధ ప్రెసిడెంట్‌ దాకా..

8 Nov, 2020 04:42 IST|Sakshi
భార్యతో బైడెన్‌ (ఫైల్‌)

బైడెన్‌ ప్రస్థానం

వాషింగ్టన్‌: ఐదు దశాబ్దాలుగా అమెరికా రాజకీయాల్లో కొనసాగుతున్న జో బైడెన్‌(77) కల ఎట్టకేలకు నెరవేరింది. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన డొనాల్డ్‌ ట్రంప్‌పై ఘన విజయం సాధించారు. అధ్యక్షుడిగా శ్వేతసౌధంలో అడుగు పెట్టబోతున్నారు. అమెరికా చరిత్రలో పిన్నవయస్కులైన సెనేటర్లలో ఒకడిగా రికార్డు సృష్టించిన బైడెన్‌ ఇప్పుడు అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా మరో రికార్డు నెలకొల్పబోతున్నారు. ఆయన గతంలో ఆరుసార్లు సెనేటర్‌గా ఎన్నికయ్యారు. 1988, 2008లో అధ్యక్ష పదవి కోసం పోటీపడినప్పటికీ డెమొక్రటిక్‌ పార్టీలోనే విజయం సాధించలేకపోయారు. మూడో ప్రయత్నంలో అనుకున్నది సాధించారు. బరాక్‌ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బైడెన్‌ రెండు పర్యాయాలు ఉపాధ్యక్షుడిగా సేవలందించారు.
 
► జో బైడెన్‌ 1942లో పెన్సిల్వేనియాలో ఓ క్యాథలిక్‌ కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఆయన అసలు పేరు జో రాబినెట్‌ బైడెన్‌ జూనియర్‌.  
► యూనివర్సిటీ ఆఫ్‌ డెలావర్‌లో చదివారు.  
► 1968లో సైరకాస్‌ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు.  
► మొదటిసారిగా 1972లో డెలావర్‌ రాష్ట్ర సెనేటర్‌గా ఎన్నికయ్యారు. అప్పుడాయన వయసు 29 సంవత్సరాలు.  
► దేశంలో పిన్నవయస్కుడైన సెనేటర్‌గా గుర్తింపు పొందారు.  
► సెనేట్‌లో అత్యంత తక్కువ ఆస్తులు కలిగిన సెనేటర్‌గా కూడా ఆయన అప్పట్లో పేరుగాంచారు.  
► 1972లో జరిగిన కారు ప్రమాదంలో బైడెన్‌ మొదటి భార్య, 13 నెలల వారి కుమార్తె నవోమీ మరణించారు.  
► బైడెన్‌ 1977లో జిల్‌ జాకబ్స్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు.  
► వారికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు జన్మించారు. ఒక కుమారుడు బ్రెయిన్‌ ట్యూమర్‌తో మరణించాడు.

మరిన్ని వార్తలు