చైనా నుంచి తైవాన్‌ను కాపాడుతాం

20 Sep, 2022 04:53 IST|Sakshi

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టీకరణ

బీజింగ్‌: తైవాన్‌ను ఆక్రమించుకునేందుకు చైనా ప్రయత్నిస్తే అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఆదివారం పునరుద్ఘాటించారు. సీబీఎస్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు స్పష్టం చేశారు. చైనా ఆక్రమణ నుంచి అమెరికా బలగాలు, ప్రజలు తైవాన్‌ను రక్షిస్తారని పేర్కొన్నారు. ‘స్వాతంత్య్రానికి సంబంధించి తైవాన్‌ ప్రజలే సొంతంగా నిర్ణయం తీసుకుంటారు.

స్వతంత్రంగా ఉండాలంటూ వారిని మేం ప్రోత్సహించం’ అని అన్నారు. తైవాన్‌ అంశం శాంతియుతంగా పరిష్కారం కావాలన్నదే తమ విధానమని అనంతరం వైట్‌హౌస్‌ అనంతరం పేర్కొంది. ఈ విషయంలో తమ వైఖరి యథాతథమని తెలిపింది. అయితే, తైవాన్‌ విషయంలో సైనిక జోక్యంపై స్పందించలేదు.

అమెరికా హౌస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ ఇటీవలి తైవాన్‌ సందర్శనపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ ప్రాంతంపైకి క్షిపణులను ప్రయోగించడం, యుద్ధ విమానాలను మోహరించడం తదితర చర్యలతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో బైడెన్‌ చేసిన తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. దశాబ్దాలుగా ఒకే చైనా విధానాన్ని అనుసరిస్తున్న అమెరికా తైవాన్‌తో అధికారికంగా సంబంధాలు కొనసాగించడం లేదు. బైడెన్‌ వ్యాఖ్యలపై చైనా మండిపడింది.

మరిన్ని వార్తలు