Joe Biden Tour: పుతిన్‌పై బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు.. రష్యా సూపర్‌ కౌంటర్‌

27 Mar, 2022 15:11 IST|Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్నాయి. రష్యా సేనల బాంబు దాడుల్లో ఉక్రెయిన్‌ తీవ్రంగా నష్టపోయింది. దాడుల నేపథ్యంలో ఇప్పటికే పుతిన్‌పై అగ్ర రాజ్యం అమెరికా సహా మరికొన్ని దేశాలు ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ అవేవీ పట్టించుకోకుండా పుతిన్‌ మాత్రం దాడులను తీవ్రతరం చేస్తూ ముందుకు సాగుతున్నారు. 

కాగా, ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐరోపా పర్యటనలో భాగంగా చివరి రోజు పోలాండ్‌లోని ఉక్రెయిన్ శరణార్థుల శిబిరాన్ని బైడెన్‌ సందర్శించారు.  ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడిగా ఉండే అర్హత వ్లాదిమిర్ పుతిన్‌కు లేదంటూ బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆ వ్యాఖ్యలు ప్రపంచ దేశాలను టెన్షన్‌కు గురి చేశాయి.  పుతిన్‌ పదవిలో నుంచి దింపేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందంటూ దౌత్యవర్గాల్లో చర్చ మొదలైంది. 

ఈ వ్యాఖ్యలపై రష్యా ఘాటుగా స్పందించింది. రష్యా అధ్యక్షుడిని దింపేసే అధికారం బైడెన్ కు లేదని కౌంటర్‌ ఇచ్చింది. రష్యాను ఎవరు పాలించాలో నిర్ణయించేది బైడెన్ కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో బైడెన్‌ వ్యాఖ్యలపై వైట్‌ హౌస్‌ ఆదివారం వివరణ ఇచ్చింది. రష్యాలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు బైడెన్‌ పిలుపునివ్వడంలేదని తెలిపింది. పొరుగు దేశాలపై అధికారం చెలాయించేందుకు హక్కు పుతిన్‌కు లేదని చెప్పడంలో భాగంగానే అమెరికా అధ్యక్షుడు అలా వ్యాఖ్యలు చేశారని స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు